తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చునని... రేపు, ఎల్లుండి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రెండు రోజుల పాటు తెలంగాణలో గంటకు 30 కిలో మీటర్ల నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.భద్రాచలం వద్ద ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు గోదావరి నీటిమట్టం 52.1 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం రెండో ప్రమాద హెచ్చరిక వద్ద కొనసాగుతోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. భారీ వర్షం, వరదల కారణంగా పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేశ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.