ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన కటికాల రామకృష్ణ దంపతులకు తొమ్మిదేళ్ల కుమార్తె అంజలీ కార్తీక, కుమారుడు వెంకట గణేష్ ఉన్నారు. శుక్రవారం ఉదయం చిన్నారి అంజలి తన తండ్రి మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో అంజలి చేతులు తడిగా ఉండటం వల్ల ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలింది. దీనిని గమనించిన తల్లిదండ్రుల బాలికకు సపర్యలు చేశారు. అయినప్పటికీ ఎటువంటి చలనం లేకపోవడంతో హుటాహుటిన అదే గ్రామంలోని ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యుడు.. అప్పటికే బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. తమ కళ్లెదుటే కన్నకూతురు గిలగిలా కొట్టుకుంటా ప్రాణాలు కోల్పోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. చిన్నారి అంజలి అదే గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతోంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
విద్యుత్ పరికరాల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు పదే పదే హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా మొబైల్ ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. తడి చేతులతో కరెంట్ స్విచ్ఛ్‌లు ఆన్ చేయొద్దని, దీనివల్ల విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఛార్జింగ్ పెడుతూ పలువురు ప్రమాదశవాత్తూ చనిపోయిన ఘటనలు ఉన్నాయి. విద్యుదాఘతంతో చనిపోయి వారిలో 18 నుంచి 45 ఏళ్ల వయసులో కుటుంబాన్ని పోషించే వారే 66 శాతమని ఓ నివేదిక వెల్లడించింది.
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కోసం జాతీయ భద్రతా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఏటా జూన్ 26ను జాతీయ విద్యుత్ భద్రతా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఆ రోజు నుంచి వారంపాటు విద్యుత్ భద్రతా వారోత్సవాన్ని చేపట్టి, ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. అయినాసరే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విద్యుత్ భద్రతా సూత్రాలను కూడా రహదారి భద్రతా నియమావళి మాదిరిగా స్కూల్ స్థాయి నుంచే పాఠ్యాంశాల్లో చేరిస్తే విద్యుత్ ప్రాధాన్యాన్ని విద్యార్థులు అవగాహన చేసుకుని, దాని వల్ల జరిగే ప్రమాదాల నుంచి తప్పించుకునే మార్గాలను తెలుసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.