తెలంగాణలో బడ్జెట్ సమావేశాలలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసెంబ్లీ వేదికగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వాటి అమలులో జరిగిన అవకతవకలపై అధికార పక్షం ఆరోపణలు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలతో పాటు సవాళ్లు, వార్నింగులు కూడా నడుస్తున్నాయి. ఇంత హాట్ హాట్‌గా జరుగుతున్న సమావేశాల్లో తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ అంశం ప్రస్తావనకు వచ్చింది. స్మితా సబర్వాల్ ఇటీవల చేసిన ట్వీట్ పై దుమారం చెలరేగగా.. ఆ అంశం ఇప్పుడు అసెంబ్లీ వరకు చేరుకుంది.
బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ చాలా విషయాలు ప్రస్తావించారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి ప్రస్తావించటమే కాకుండా.. వాటి విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే.. స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన ట్వీట్ విషయాన్ని ప్రస్తావించారు. దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ.. అవమానించే విధంగా ఒక ఐఏఎస్ వ్యాఖ్యానించారని కూనంనేని గుర్తుచేశారు. ఈ విషయంపై తనను దివ్యాంగులైన ప్రొఫెసర్లు కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంరక్షణ మాదిరిగానే వారికి కూడా ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని కూనంనేని ప్రతిపాదించారు.
దివ్యాగులకు అఖిల భారత సర్వీసుల్లో రిజర్వేషన్లు అవసరం లేదంటూ స్మిత సబర్వాల్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం నెట్టింట దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఆమె చేసిన ట్వీట్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. చాలా మంది స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్‌ను వ్యతిరేకించారు. కొంత మంది మాత్రం ఆమె వాదనకు మద్దతు ప్రకటించారు. ఎంత మంది వ్యతిరేకించినప్పటికీ స్మితా సబర్వాల్ మాత్రం ఆమె తన వాదనకు కట్టుబడే ఉన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అసెంబ్లీ వేదికగానే వార్నింగ్ ఇచ్చారు. తన అసలు స్వరూపం ఇంకా తెలియదని.. తన జోలికి రావొద్దని.. సభలోనే వార్నింగ్ ఇచ్చారు. తాను మాట్లాడుతున్నప్పుడే హరీష్ రావుకు ఇబ్బంది అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. "హరీష్ రావు.. నా వర్జినాలిటీ ఇంకా మీకు తెలియదు.. నేను ఇంకా అన్ని విషయాలు మాట్లాడితే బాగుండదు.. నా జోలికి రాకండి.." అంటూ వార్నింగ్ ఇచ్చారు.
బడ్జెట్ మీద అనేక మంది మాట్లాడిన తర్వాత తనకు చాలా ఆశ్చర్యం వేస్తుందని కూనంనేని చెప్పుకొచ్చారు. అన్నప్రాసన రోజే.. ఆవకాయ తీనమన్నట్లు చేస్తున్నారని.. అంత ఇప్పుడే అయిపోయిందన్నట్టుగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చి చేయలేదో.. ఈ ప్రభుత్వంలో ఉన్న వారు చూశారని.. కాబట్టి ఆ పొరపాట్లు చేస్తారని అనుకోవడం లేదని కూనంనేని అసెంబ్లీలో చెప్పుకొచ్చారు.