రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది. అందులో పోలీస్ వ్యవస్థ కూడా భాగం అవ్వడం దురదృష్టకరమని మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అక్రమ అరెస్టును ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు.కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థతను, చేతగానితనాన్ని దిలీప్ ప్రశ్నించడాన్ని రేవంత్ సర్కారు తట్టుకోలేకపోతోందన్నారు.
కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించగా హైకోర్టు చీవాట్లు పెట్టినా, బుద్ధి రాలేదని మండిపడ్డారు. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపు లోకి తీసుకున్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో చెప్పకుండా అరెస్ట్ చేశారు. ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా ప్రజాపాలన అంటే? అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చని అనుకుంటే అది మీ భ్రమే. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్భందాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింత పుట్టుకొస్తారన్నారు.