తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి కన్నుమూశారు. రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ (సెప్టెంబర్ 6న) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో అభిమానులు తీవ్ర విషాదంలో ఉన్నారు. బాలకృష్ణారెడ్డి పార్ధివ దేహాన్ని భువనగిరికి తరలిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు భువనగిరి పట్టణ శివారులోని మగ్గంపల్లి రోడ్డులోని ఆయన ఫామ్ హౌస్‌లో సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
జిట్టా మరణంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువు బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు. ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కేటీఆర్, హరీష్‌రావు తదితర బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. ఆయన కోలుకుని డిశ్చార్జ్ అవుతారని ఆకాంక్షించామని.. కానీ ఆయన కన్నుమూయడం బాధాకరమని నేతలు విచారం వ్యక్తం చేశారు.
జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) ఆవిర్భావం అనంతరం యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. జిట్టా బాలకృష్ణారెడ్డి 2009 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని భావించారు.. కానీ టికెట్ దక్కకపోవడంతో గులాబీ పార్టీని వీడి ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడారు. 2009 ఎన్నికల తర్వాత జిట్టా.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత పరిణామాలు మారగా.. వైఎస్ జగన్ వైఎస్సార్‌సీపీని ఏర్పాటు చేశారు. అప్పుడు జిట్టా కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు.
వైఎస్ జగన్ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారనే కారణంతో వైఎస్సార్‌సీపీని వీడారు. ఈసారి ఆయనే సొంతంగా యువ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు.. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాతో తన యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేసి.. కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తప్పించం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన జిట్టా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్‌లో చేరారు.