తెలంగాణలో రైతుల కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బీమా పథకం కోసం మొబైల్ యాప్‌ను తీసుకురాబోతోంది. సాంకేతిక సమస్యలను నివారించి పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు యాప్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యాప్‌ను రూపొందిస్తోంది.. త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ యాప్‌ను అధికారుల సూచనలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. యాప్ ద్వారా రైతులు, నామినీల వివరాల నమోదుతో పాటు మరణ ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేస్తే.. ఆ వెంటనే బీమా సాయం చెల్లింపులు సులభంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు బీమా పథకాన్న అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 18 నుంచి 60 ఏళ్ల లోపు వయసు రైతు ఏ కారణంతోనైనా చనిపోతే.. ఆ కుటుంబానికి ఈ పథకం కింద రూ.5 లక్షల సాయాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పథకం కోసం పదేళ్లుగా జీవిత బీమా సంస్థకు రైతుల ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు అమలు చేస్తున్న ఈ బీమా పథకం అమలులో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలామంది రైతులకు సాయం అందడం లేదు.
రైతు బీమాకు సంబంధించి వయోపరిమితి సమస్యతో పాటుగా ఆధార్‌లో తప్పులు, నామినీ పేర్లు సరిగా నమోదు కాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇటు మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా సకాలంలో అందకపోవడంతో.. రైతు కుటుంబాలకు సాయం అందని పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా బీమా కోసం నమోదు చేసుకునేందుకు రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు యాప్ అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు రైతు బీమా కోసం కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు.