హైదరాబాద్ మహా నగర విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలో నగరం చుట్టూ ఉన్న మరికొన్ని ప్రాంతాలు కలవనున్నాయి. నగరం చుట్టూ దాదాపుగా 51 గ్రామాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో విలీనం కానున్నాయి. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ ప్రాంతం విస్తీర్ణం 7,200 చదరపు కిలోమీటర్లు కాగా.. త్వరలోనే మరికొన్ని ప్రాంతాలు కూడా కలవనున్నాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల వరకు హెచ్‌ఎండీఏ విస్తరణ జరగనుంది.
దాదాపు 841 గ్రామాలు మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోకి రానున్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని నిర్మాణాలకు హెచ్‌ఎండీఏనే అనుమతి ఇస్తోంది. 5 అంతస్తులు దాటిన నిర్మాణాలు, లేఅవుట్లకు హెచ్‌ఎండీఏ అధికారులు అనుమతులు జారీ చేస్తున్నారు. ఈ అనుమతుల మంజూరీ ద్వారా జీహెచ్‌ఎంసీకి నెలకు రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ప్రస్తుతం నగర అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టగా.. ఆయా ప్రాంతాలన్నీ ఇక నుంచి బల్దియా కిందకు రానున్నాయి. త్వరలోనే ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేయనుండగా.. ఇక నుంచి బల్దియానే అనుమతులు జారీ చేయనుంది.
ఇక తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్‌గా రీజినల్ రింగు రోడ్డును నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సగం తెలంగాణను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ఆర్ఆర్ఆర్‌ను నిర్మిస్తున్నారు. గ్రేటర్ పరిధిని ఆర్‌ఆర్‌ఆర్ వరకు విస్తరించేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల విలీనం చేయనున్నారు. అంతేకాకుండా ఔటర్ రింగు రోడ్డుకు ఆర్‌ఆర్‌ఆర్‌కు మధ్య రేడియల్ రోడ్లు, గ్రిడ్ రోడ్లు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. వచ్చే 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని మాస్టర్‌ప్లాన్-2050 రూపకల్పన కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్‌లను అనుసంధానం చేసేలా ఈ రోడ్లు నిర్మించనున్నారు. అయితే ఇవి ఎక్కడ నిర్మించనున్నారనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. మెుత్తం 21 చోట్ల రేడియల్ రోడ్లు నిర్మించనున్నట్లు సమాచారం. ఈ రోడ్లు అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాలకు కొత్త పరిశ్రమలు రానున్నాయి. దీంతో భూముల ధరలకు రెక్కలు రావటంతో పాటు తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి చెందనుంది.