ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద బాధితుల కోసం కాంగ్రెస్ నేతల భారీ విరాళం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 08, 2024, 07:39 PM

తెలంగాణలో కురిసిన భారీ వర్షాల వల్ల పోటెత్తిన వరదలకు భారీ నష్టం వాటిల్లింది. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వచ్చిన వరదలకు ఎంతో మంది నిరుపేదలు నిరాశ్రులయ్యారు. భారీ ఎత్తున ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా జరిగింది. అయితే.. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అండగా ఉండేందుకు చాలా మంది తమకు తోచినంత సాయం అందిస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు పారిశ్రామికవేత్తల నుంచి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా భాదితుల కోసం భారీ విరాళం ప్రకటించారు.


కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్‌ ఛైర్మన్లుతో పాటు ప్రభుత్వ సలహాదారులు అందరూ.. తమ 2 నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు టీపీసీసీ కొత్త అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సూచనల మేరకు ప్రజా ప్రతినిధులు ఈ విరాళం ప్రకటించారు. కాగా.. ఇది బీఆర్ఎస్ నేతలు ప్రకటించిన సాయానికి రెట్టింపు కావటం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు.. తమ ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కాగా.. వారు చేసిన సాయానికి రెట్టింపుగా కాంగ్రెస్ ప్రతినిధులు రెండు నెలల జీతం ప్రకటించటం గమనార్హం.


ఇదిలా ఉంటే.. వరద బాధితులకు హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ కూడా తనవంతు సాయం చేస్తోంది. బాధితులకు నిత్యావసర సరకులతో కూడిన కిట్లను అందజేస్తోంది. లారీల్లో పది వేల నిత్యవసర కిట్లను ఇప్పటికే ఖమ్మం పంపించింది. అయితే.. ఈ ఒక్కో కిట్‌ విలువ సుమారు 3 వేల రూపాయలు ఉంటుందని హైసియా తెలిపింది. ఈ లారీని మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.


మరోవైపు.. వరద బాధితులను ఆదుకునేందుకు అటు సినీ ప్రముఖులు కూడా భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇటు తెలంగాణ, అటు ఏపీ రెండు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం భారీ విరాళాలు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, నటసింహం బాలకృష్ణ, డార్లింగ్ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా బడా హీరోలంతా తమవంతు సాయం ప్రకటించారు. ఇక.. హైదరాబాద్‌లోని పలు కంపెనీలు కూడా వరద సాయం ప్రకటిస్తున్నాయి.


ఇదిలా ఉంటే.. మొన్నటి వరదలకు కకావికలమైన ప్రాంతాలు ఇప్పుడిప్పుడే మెల్లి మెల్లిగా కోలుకుంటుంగా.. ఇప్పుడు మరోసారి వరుణుడు భయపెడుతున్నాడు. భారీ వర్షాలతో మరోసారి వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతుండటంతో.. బాధితుల్లో మరోసారి వణుకు మొదలైంది. భారీ వర్షాల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని రకాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com