రేవంత్ ప్రభుత్వంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయటం లేదని విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో అన్నదాతలను దగా చేశారని మండిపడ్డారు. రైతు రుణమాఫీని ఎగ్గొట్టేందుకు రేవంత్ ప్రభుత్వం 31 సాకులు చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాయింట్ ఫ్యామిలీ అని, సింగల్ ఫార్మర్ అని, ఆధార్ మిస్ మ్యాచ్ అని, రెన్యూవల్ చేసుకోలేదంటూ పలు కారణాలతో రుణమాఫీకి మంగళం పాడారని ధ్వజమెత్తారు. రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ మాట తప్పారన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అన్నదాతల పాలిట యమపాశంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా 490 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని హరీష్ రావు విమర్శించారు. రుణమాఫీ కానందు వల్లే మేడ్చల్ జిల్లా వ్యవసాయ కార్యాలయంలో సురేందర్ రెడ్డి అనే రైతు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడని మండిపడ్డారు. సురేందర్ రెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని హరీష్ ఆరోపించారు. రుణ మాఫీకి రేషన్ కార్డు లింక్ పెట్టడం వల్లే ఆయన ప్రాణాలు తీసుకున్నాడని ఆరోపించారు.
ఈ విషయం బాధితుడే తన బ్యాంక్ పాస్ బుక్‌పై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతికాని తనంవల్లనే రైతుల ప్రాణాలు పోతున్నాయన్నారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల పెళ్లి కాకపోతే కూడా రుణమాఫీ వర్తించలేదని.. పెళ్లికి దీనికి సంబంధ ఏంటని హరీష్ ప్రశ్నించారు. ఇప్పటికీ 21లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదని విమర్శించారు. ఈ పథకం కిదం లబ్ధిపొందిన అన్నదాతల కంటే కంటే పొందని రైతులే ఎక్కువ మంది ఉన్నారన్నారు. ఆయా రైతులు ఇప్పటికీ బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులకు కూడా పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదన్నారు.
ఇక రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో ఇప్పటికీ తేలటం లేదన్నారు. ఈ అంశంపై ఇప్పటికీ స్పష్టతనివ్వటం లేదన్నారు. రైతులకు ఇస్తామన్న పంట బోనస్ బోగస్ అయ్యిందని దుయ్యబట్టారు. 15 ఆగస్టు నాటికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి రైతన్నలను నిలువునా మోసం చేశారని ఫైరయ్యారు. రైతులను మోసం చేసిన రేవంత్ వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతులెవరూ బలవంతపు ఆత్మహ్యతలు చేసుకోవాల్సిన పనిలేదని.. మీ పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు.