గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను బుల్డోజర్లతో కూల్చేస్తుంది. గత నెల రోజుల వ్యవధిలోనే వందల అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఈ క్రమంలో చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. శనివారం సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌కు సైతం నోటీసులు జారీ చేశారు.
గచ్చిబౌలిలోని రంగలాల్ కుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు చేప్టటినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. ఈ మేరకు అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించాలని మురళీ మోహన్‌కు చెందిన జయభేరి రియల్ ఎస్టేట్ సంస్థకు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా నిర్మాణాలు కూల్చకపోతే తామే కూల్చేస్తామని హైడ్రా హెచ్చరించింది. మురళీ మోహన్‌కు నోటీసు జారీ చేయటం చర్చనీయాంశమైంది.
తాజాగా.. హైడ్రా నోటీసులపై మురళీమోహన్ స్పందించారు. తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని చెప్పారు. ఇప్పటి వరకు తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని చెప్పారు. రంగలాల్ కుంట బఫర్ జోన్‌లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారన్నారు. ఆ షెడ్డును తామే తొలగిస్తామని వెల్లడించారు. స్థానికుల ఫిర్యాదుతో అధికారులు వచ్చారని పేర్కొన్నారు. కబ్జాలు చేసి నిర్మించాల్సిన అవసరం లేదని.. కస్టమర్లు నష్టపోకుండా క్లియర్ టైటిల్ ఉన్న నిర్మాణాలే తాము చేపడతామని చెప్పారు.
ఇక హైడ్రా కూల్చివేతలు ఆగటం లేదు. నేడు కూడా నగరంలోని పలు చోట్ల కూల్చివేతలు చేపట్టారు. మాదాపూర్ సున్నం చెరువును ఆక్రమించిన నిర్మాణాలు చేపట్టగా.. ఆ కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తు్న్నారు. బాచుపల్లి బొరంపేట చెరువు పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను సైతం అధికారులు కూల్చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్‌లోని కత్వా చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన విల్లాలను కూల్చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని హెచ్‌ఎంటీ, వాణి నగర్ కాలనీల్లోని అక్రమ నిర్మాణాలను కూడా అధికారులు నేలమట్టం చేస్తున్నారు.