ఎంతటి గొప్ప నాయకుడికైనా ధైర్యం చాలా ముఖ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాయకుడిగా ఎదగాలంటే తెలివితేటలు, నైపుణ్యం, కష్టపడి పనిచేయడంతో పాటు కొన్నిసార్లు అదృష్టం కూడా అవసరమని అన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఐఎస్‌బీ లీడర్ షిప్ సమ్మిట్ ప్రారంభం కాగా.. ముఖ్య అతిథిగా సీఎం హాజరయ్యారు. అనంతరం మాట్లాడిన ఆయన.. రాజకీయాల నుంచి తాను నాయకత్వం అంటే ఏంటో తెలుసుకున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన వారసత్వం ఉందని చెప్పారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి నాయకులే అందుకు ఉదాహరణ అని అని అన్నారు.
ఎవరైనా సరే గొప్ప పనులు చేయడానికి రిస్క్ తీసుకోవాలని.. రిస్క్ తీసుకోకుండా కొన్ని సాధించలేమని వ్యాఖ్యనించారు. గొప్ప నాయకులుగా ఎదగాలంటే కొన్నిసార్లు త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలన్నారు. అలాంటి వారే గొప్పగా ఎదగగలరని అన్నారు. మంచి నాయకుడిగా ఎదగాలంటే.. ముందుగా ధైర్యం, త్యాగం అనే రెండు విలువల గురించి తెలుసుకోవాలని సూచించారు. ధైర్యంతో పాటు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే జీవితంలో ఓటమి తెలియకుండా విజయం సాధిస్తారని ఐఎస్‌బీ స్టూడెంట్స్‌కు సూచించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల జీడీపీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే తన నెక్స్ట్ టార్గెట్ అని అన్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోని ప్రతి భాగానికి తీసుకెళ్లడానికి నాకు మీ సాయం కావాలని విద్యార్థులను కోరారు. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలతో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం గురించి గొప్పగా మాట్లాడాలన్నారు. భారత్‌లోని ఇతర నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని తాను ఏనాడు కోరుకోవటం లేదని చెప్పారు. లండన్, పారిస్, న్యూయార్క్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో హైదరాబాద్ నగరం పోటీపడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
ప్రపంచపటంలో భారతదేశం, హైదరాబాద్ నగరాన్ని అత్యుత్తమంగా మారాలన్నది చాలా పెద్ద లక్ష్యమన్నారు. అయినా అది అసాధ్యం కాదన్నారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాట్లు వెల్లడించారు. తాను సౌత్ కొరియాలో స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించినట్లు చెప్పిన రేవంత్ అటువంటి సౌకర్యాలు మన స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఉంటాయని అన్నారు. ఐఎస్బీ విద్యార్థులుగా మీరు హైదరాబాద్, తెలంగాణతో పాటు న్యూ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌లు అని చెప్పుకొచ్చారు.