నాన్ వెజ్ ప్రియులకు చికెన్ బిర్యానీ అంటే ఒక ఎమోషన్. అందులోనూ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ కిప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.చికెన్ బిర్యానీ పేరు చెప్తేనే నోట్లో నీళ్లూరుతుంటాయి. వేడి వేడి చికెన్ బిర్యానీ ప్లేట్ లోకి రావడమే ఆలస్యం.. లాగించడమే తరువాయి. మంచిగా మసాలాలు దట్టించిన చికెన్ బిర్యానీ తింటే.. "ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.." అనాల్సిందే. కానీ.. ఇటీవల కాలంలో హోటళ్లలో బిర్యానీలు ఎలా చేస్తున్నారో చూస్తుంటే.. బయట బిర్యానీ తినాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. బిర్యానీ కోసం కక్కుర్తి పడి ఎక్కడపడితే అక్కడ తింటే.. తర్వాత ఆస్పత్రుల బిల్లులు కట్టుకోవాలి.బిర్యానీలో బల్లి, బొద్దింకలు కనిపించిన సంఘటనలు చూశాం. హోటళ్లలో అంటే కిచెన్లు నీట్ గా ఉండవు. కానీ.. వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటున్న కాలేజీల మెస్ లలో కూడా ఆహారంలో జంతువులు, కీటకాలు దర్శనమిస్తున్నాయి. అవికూడా చికెన్ తో చక్కగా మసాలాల్లో వేగుతున్నాయి. తాజాగా గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ (Gachibowli IIIT)లోని కదంబ మెస్ లో విద్యార్థులకు వడ్డించిన బిర్యానీలో కప్ప (Frog in Biryani) దర్శనమిచ్చింది. అదిచూసిన విద్యార్థులకు వాంతి ఒక్కటే తక్కువ. పొరపాటున అందులో పడిందా అంటే.. దానిని చూస్తే అలా లేదు. చికెన్ తో పాటు మసాలాలు దట్టించి మరీ వండిన కప్పలా కనిపిస్తోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం మెస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన అక్టోబర్ 16న జరగ్గా.. తాజాగా వెలుగుచూసింది. బిర్యానీలో కప్ప వచ్చిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.