తెలంగాణలో రహదారుల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్న రహదారిని త్వరలోనే 6 వరుసలకు విస్తరించనున్నారు. కాగా, తెలంగాణలో మరో రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది.
హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రహదారిలో కొత్తపల్లి (రాజీవ్ రహదారి) ప్రస్తుతం రెడు వరుసల రహదారి ఉండగా.. దాన్ని విస్తరించనున్నారు. ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేదుకు తాజాగా రేవంత్ సర్కార్ ముందుకొచ్చింది. రహదారి విస్తరణకు అనేకసార్లు కేంద్రం వద్ద ప్రతిపాదనలు పెట్టినా.. స్పందించకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చింది. మొదటి దశలో భాగంగా రహదారి అభివృద్ధికి రూ.77.20కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రహదారులు, భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ తాజాగా జీవో జారీ చేశారు.
కొత్తపల్లి-హుస్నాబాద్-జనగాం నేషనల్ హైవే అభివృద్ధిపరచాలనే డిమాండ్ గత మూడేళ్లుగా ఉంది. కరీంనగర్-హుస్నాబాద్-జనగాం మీదుగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట, సూర్యాపేట, ఏపీలోని విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లవచ్చు. కరీంనగర్ వైపు మంచిర్యాల, గోదావరిఖని, జగిత్యాల ప్రాంతాలకు వాహనాల రాకపోకలు ఈ రహదారిపై సాగుతుంటాయి. ఈ రహదారిని భారత్‌మాల పథకం కింద నేషనల్ హైవే అభివృద్ధికి మూడేళ్ల క్రితం ప్రతిపాదించినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో రాష్ట్ర రహదారిగా అభివృద్ధి పరుస్తామని గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
అందులో భాగంగా కరీంనగర్(కొత్తపల్లి)-హుస్నాబాద్ వరకు 4 లైన్ల రహదారిగా అభివృద్ధికి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. మెుదటి దశలో ఎండీఆర్ ప్లాన్ కింద ప్యాకేజీ-2లో రహదారిలో 11కి.మీ నుంచి 21కి.మీ వరకు 4 లైన్ నిర్మాణానికి రూ.77.20కోట్లకు తాజాగా పరిపాలన అనుమతులు మంజూరయ్యాయా. ఈ రహదారి 4 లైన్లుగా మారితే.. హుస్నాబాద్ నుంచి కరీంనగర్ రవాణా సౌకర్యాలు మరింత మెరుగవుతుంది. హుస్నాబాద్, కోహెడతో పాటు జనగాం, హనుమకొండ జిల్లాల నుంచి రాకపోకలు సాగించే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా దూసుకెళ్లిపోవచ్చు.