ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపే అవకాశముందన్న కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 08:24 PM

ప్రజలపై భారీగా విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపనున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచాలంటూ 9 ప్రతిపాదనలు ఏవైతే డిస్కంలు చేశాయో వాటిని విరమించుకోవాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ ఛైర్మన్‌ను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ఇళ్లలో వాడుకునే కరెంట్‌కు సంబంధించి నెలకు రూ.300 యూనిట్లు దాటితే ఫిక్స్ డ్ ఛార్జీలు రూ.10 నుంచి ఏకంగా రూ.50 పెంచాలని ప్రతిపాదన చేశారని మండిపడ్డారు. ఇది అతి ప్రమాదకరమైన ప్రతిపాదన అన్నారు. ఈ ఒక్క నిర్ణయం మొత్తం ప్రజల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లోకి నెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.సామాన్యుల గృహాలకు సంబంధించి భారీగా విద్యుత్ బిల్లుల భారం పడనుందన్నారు. పరిశ్రమలన్నింటినీ ఒకే కేటగిరీ అనే ప్రతిపాదన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా అసంబద్ధమైన, సిల్లీ ఆలోచన అన్నారు. ఇది పరిశ్రమలకు తీవ్ర అన్యాయం చేసే నిర్ణయమన్నారు. దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి పిచ్చి ఆలోచన చేస్తున్నారని ధ్వజమెత్తారు. పరిశ్రమలన్నింటికీ ఒకే టారిఫ్ చేసే విధంగా చేయటమంటే అది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారుతుందని హెచ్చరించారు.ఇప్పటికే రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మందగమనంలో ఉందని, ఫాక్స్‌కాన్ సంస్థ కూడా కంపెనీ విస్తరణకు సంబంధించి ఏమీ చెప్పటం లేదన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రా అంటున్నారని... కానీ మన తెలంగాణ పేరు చెప్పటం లేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేన్స్ సహా కొన్ని పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. ప్రభుత్వ అసంబద్ధమైన నిర్ణయాల కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలన్న అంశానికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం ఏమీ చెప్పటం లేదన్నారు.విద్యుత్ సరఫరా విషయంలో ఇప్పటికే ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా డిస్కం‌లు ఛార్జీలు పెంచాలని ప్రతిపాదన చేశాయని గుర్తు చేశారు. ట్రూ అప్ ఛార్జీలు రూ.12 వందల కోట్లు కావాలంటే తామే భరిస్తామని అప్పుడు కేసీఆర్ చెప్పి... ప్రజల మీద భారం పడకుండా చేశారన్నారు. విద్యుత్‌ను తాము కేవలం వ్యాపార వస్తువుగా చూడలేదని, అది సామాన్యుడి జీవితంలో దైనందిన అవసరంగా భావించినట్లు చెప్పారు. అందుకే తాము రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించామని, 24 గంటల కరెంట్ ఇచ్చామన్నారు.నాయి బ్రహ్మణులు, రజకులకు ఉచిత కరెంట్ ఇచ్చామని, దళితులకు ఉచిత కరెంట్ ఇచ్చే ప్రయత్నం చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు 7 వేల మెగావాట్ల సామర్థ్యం ఉంటే దానిని 24 వేల మెగావాట్లకు తీసుకువెళ్లామన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచితే అది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారుతుందని హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీల పెంపు అనేది రాష్ట్ర అభివృద్ధి అంశంతో ముడిపడి ఉందన్నారు. సిరిసిల్లలో పవర్ లూమ్ పరిశ్రమ, కాటేదాన్‌లో పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీ ఇచ్చామన్నారు. తాజా ప్రతిపాదనలతో వారికి సబ్సిడీ లేకుండా పోతుందని వాపోయారు.అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతామంటే అంగీకరించవద్దని ఈఆర్సీ ఛైర్మన్‌ను కోరినట్లు చెప్పారు. ఈ నెల 23న పబ్లిక్ హియరింగ్‌లో పాల్గొనాలని ఈఆర్సీ ఛైర్మన్ కోరారని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెండు రోజుల ముందే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళుతున్నామన్నారు. ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ 23న హియరింగ్స్‌లో తమ వాదనలు వినిపిస్తామన్నారు. అశోక్ నగర్ వెళ్లకుండా తనను అడ్డుకుంటే.. పిల్లలే తెలంగాణ భవన్‌కు వచ్చి తనను కలిశారని వెల్లడించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com