యూనిఫాంలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్... న్యాయం కోసం పోరాడుతున్న ఓ కానిస్టేబుల్ భార్యపై చేసుకునే స్థాయికి రాష్ట్ర పోలీస్ వ్యవస్థను దిగజార్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా చరిత్రలో నిలిచిపోతారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఖండించదగ్గ విషయమన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.బెటాలియన్లలో పని చేస్తోన్న పోలీస్ కానిస్టేబుళ్ల చేత కూలీ పనులు చేయిస్తున్నారని, తక్షణమే వన్ పోలీస్ విధానం అమలు చేయాలని కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనకు దిగారు. బెటాలియన్ల ముందు ధర్నాకు దిగిన కానిస్టేబుళ్ల భార్యలను మహిళా పోలీసులు అదుపులోకి తీసుకొని బలవంతంగా జీపు ఎక్కించారు. ఈ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.ముఖ్యమంత్రికి పోలీసు కుటుంబాల బాధల గురించి వినే సమయం లేనట్లుగా ఉందని, కనీసం మీరైనా తక్షణమే స్పందించి, సున్నితమైన ఈ సమస్యను పరిష్కరించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. పోలీసుల మనసుల్లో అశాంతి ఉండకూడదన్నారు. అశాంతిని దరిచేరనీయకుండా చూడాలన్న విషయం పోలీసు బాసుగా మీకు తెలియంది కాదన్నారు. ఈ వివాదం మరింత ముదిరితే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మరింత విషమిస్తుందని హెచ్చరించారు.ఇప్పటికే హత్యలు జరుగుతున్నా పట్టించుకునే వాళ్లు కరవయ్యారని, అందుకే దయచేసి కొంతకాలం పాత పద్దతిలోనే రికార్డెడ్ పర్మిషన్‌ని కొనసాగించాలని సూచించారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అప్పుడు కొత్త పంథాను అనుసరించాలని సూచించారు. పోలీసులే తమ సోదరుల భార్యలను ఈడ్చుకుంటూ పోవడం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు ఏ డీజీపీ ఈ పరిస్థితిని రానివ్వలేదని, మీరూ రాకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు.