కమీషన్లకు ఆశపడిన ప్రభుత్వ అధికారులు కబ్జాకోరులతో చేతులు కలిపారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టంచి, రికార్డులు తారుమారు చేసి రూ.600 కోట్ల విలువైన భూమికి ఎసరు పెట్టారు. ప్రభుత్వ భూములను దర్జాగా రిజిస్ట్రేషన్ చేశారు. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం గ్రామపరిధిలో రూ.600 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా కట్టబెట్టారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా బాలానగర్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్, ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్ జె.గురుసాయిరాజ్‌తో పాటుగా, మహ్మద్ అబ్దుల్ రజాక్, నవీన్‌కుమార్ గోయల్, మహ్మద్ అబ్దుల్ అదిల్, సయేదా కౌజర్, అఫ్షా సారాలను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. రాయదుర్గం గ్రామ పరిధిలో రూ.600 కోట్ల విలువైన 12.09 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు గ్రీక్ బిల్డర్స్ సంస్థ సిద్ధమైంది. నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న ఈ భూములను కొట్టేసేందుకు నిందితులు పెద్ద స్కెచ్ వేశారు. ఈ భూమి యజమాని ఫైజుల్లా అనే వ్యక్తిగా చెబుతూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. ఫైజుల్లా వారసులుగా మహ్మద్ సయేదా కౌజర్, అఫ్షా సారా, అబ్దుల్ అదిల్ పేరిట ఫోర్జరీ సంతకాలతో గవర్నమెంట్ రికార్డులు తారుమారు చేశారు. ఆ నకిలీ పత్రాలతో ఫైజుల్లా వారుసులు చెప్పుకుంటున్న నిందితులు, గ్రీక్ బిల్డర్స్ ఎల్‌ఎల్‌పీ మధ్య అగ్రిమెంట్ కదుర్చుకున్నారు. డీజీపీఏ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్ గురుసాయిరాజ్ సహకరించాడు. డాక్యుమెంట్లు పరిశీలించకుండా కాసులకు కక్కుర్తిపడి రిజిస్ట్రేషన్ పూర్తిచేశాడు.
రాయదుర్గం 1,4,5,20 సర్వే నంబర్లలోని ఈ ప్రభుత్వ భూములు చాలా కాలంగా తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ (ఎల్‌ఐపీసీవో) ఆధీనంలో ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇక్కడ 12 ఎకరాల 9 గుంటల స్థలం ఉంది. ఈ స్థలంలో 5.16 ఎకరాల్లో యూనిటీ మాల్ నిర్మాణం చేపట్టేందుకు టీఎస్‌ఎల్‌ఐపీసీవోతో తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇటీవల లీజు అగ్రిమెంట్ చేసుకుంది. ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ చేసిన విషయం గుర్తించిన శేరిలింగంపల్లి ఎమ్మార్వో సైబరాబాద్ ఈవోబ్ల్యూలో కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న ఈవోడబ్ల్యూ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.