హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లు, స్వీట్ షాపుల్లో తెలంగామ టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హోటల్ నిర్వహకులు ఏమాత్రం శుభ్రత పాటించటం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆపరిశుభ్ర వాతావరణంలో వంటకాలు తయారు చేస్తున్నారు. గత మూడ్రోజులుగా హైదరాబాద్ నగరంలోని హోటల్స్, స్వీట్ షాపుల్లో గుర్తించిన లోపాలను అధికారులు ట్విట్టర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, చైతన్యపురి ప్రాంతాల్లోని పలు హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్, బేకరీలు, షవర్మ తయారీ, మండీ హౌజ్‌ల్లో తనిఖీలు చేపట్టగా.. దారుణమైన పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. తినడానికి ఏమాత్రం పనికిరాని కూరగాయలు, కుళ్లిపోయిన మాంసం, క్యాన్సర్ కారక సింథటిక్ ఫుడ్ కలర్స్, గ్రీజులా మారిన వంట నూనె వంటివి గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
అమీర్‌పేటలోని వాసిరెడ్డి హోమ్ ఫుడ్స్‌కు లైసెన్సు లేదు. కిచెన్‌లో బొద్దింకలు, తయారీదారుల వివరాల్లేని ‘రెడీ టూ ఈట్’ ఫుడ్ ఐటమ్స్ విక్రయిస్తున్నారు. వినూత్న ఫుడ్స్‌కు సైతం లైసెన్సు లేదు. లేబుల్స్ లేకుండా ఆహార పదార్థాల విక్రయిస్తున్నారు. హోటల్ సైతం అపరిశుభ్రంగా ఉంది. ఆగ్రా స్వీట్స్‌కు లైసెన్సు లేదు. గడువు ముగిసిన చుడవ, బేల్, ఇతర వస్తువుల అమ్ముతున్నారు. ఢిల్లీ మిఠాయివాలాలో.. ఎలుకలు, బొద్దింకలు తిరుగుతున్నాయి. తెరచి ఉంచిన చెత్త డబ్బాలు గుర్తించారు.
యూసఫ్‌గూడ ఏజీ కాలనీలోని మహమ్మదీయ షవర్మ కేంద్రంలో.. నూనె గ్రీజులా మారింది. షవర్మ తయారీకి తుప్పు పట్టిన పాత్రలు వినియోగిస్తున్నారు. ఫ్రిడ్జిలో కుళ్లిన ఆహార పదార్థాలు, ఫుడ్ లైసెన్సు లేకపోవడం వంటివి గుర్తించారు. అల్ మతమ్ మదీనా మండీలో అపరిశుభ్రంగా ఉన్న కిచెన్, సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగం, నేలపై చెత్త గుర్తించారు. రాజీవ్‌నగర్‌లోని అల్ ఖాసీం ది మండీ హౌజ్‌లో.. వంట గదిలో నేలపైనే వంట సామగ్రిని ఉంచారు. ఫ్రిడ్జిలో మురుగువంటి నీరు, జిగటగా మారిన పైకప్పు, ఎక్జాస్ట్ ఫ్యాన్, పొయ్యి తదితరాలు గుర్తించారు.
చైతన్యపురిలోని శిల్పి ఎలైట్ రెస్టారెంట్ అండ్ బార్‌లో వంటగది ఫ్లోరు, పైకప్పు జిగటగా ఉంది. మూతల్లేని చెత్త డబ్బా లు, మురుగు, ప్రమాణాల ప్రకారం లేని ఫ్రిడ్జిలు, కుళ్లిన వెజిటెబుల్స్, బొద్దింకలు, సింథటిక్ ఫుడ్ కలర్స్ గుర్తించారు. బాహర్ బిర్యానీ కేఫ్‌లో మురుగు నీరు నిలిచిపోయింది, తుప్పు పట్టిన వంట సామగ్రి, ఫ్రిడ్జిలో అపరిశుభ్రత, చాక్‌లెట్ ఫ్లేవర్ సిరప్, గడువు తీరిన హాట్ పెప్పర్ సాస్, చికెన్‌ను నేరుగా ఫ్రిడ్జిలో ఉంచడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు.