రోజురోజుకూ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎన్నో పనులను మనం ఇంట్లో ఉండి.. అరచేతిలో ఉన్న సెల్‌ఫోన్ ద్వారానే చేయగలుగుతున్నాం. ఇక రైతులకు కూడా వర్షాలు ఎప్పుడు పడతాయి.. ఎలాంటి పంటలు వేయాలి.. ఇంట్లో ఉండి పొలం దగ్గర మోటార్ ఆన్ చేయడం, ఏ పంటకు ఏ ధర ఉంది అనే విషయాలే కాకుండా మరెన్నో సౌకర్యాలు ఇప్పుడు ఫోన్‌లోనే చూసుకునే సౌకర్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పత్తి సీజన్ కావడంతో తెలంగాణ సర్కార్.. పత్తి రైతులకు మరిన్ని సౌకర్యాలు అందిస్తోంది. వాట్సప్ ద్వారా పత్తి పంట అమ్మకాలు, కొనుగోళ్లతోపాటు మొత్తం సమాచారాన్ని అరచేతిలో ఉన్న ఫోన్ ద్వారా తెలుసుకునే సౌకర్యాన్ని కల్పించింది.
పత్తి రైతుల సౌకర్యం కోసం ప్రభుత్వం వాట్సప్ సేవలను ప్రారంభించిందని.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు 8897281111 వాట్సప్ నంబర్ ద్వారా పత్తి అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన సమస్త వివరాలను అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సిద్ధమైంది. అదే సమయంలో పత్తి పంట కొనుగోళ్లలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని ఈ వాట్సప్ సేవలను వ్యవసాయ శాఖ ప్రారంభించింది. ఈ వాట్సప్ నెంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా.. పత్తి కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, పేమెంట్లకు సంబంధించిన విషయాలు, సీసీఐ సెంటర్లలో వెయిటింగ్ సమయం వంటి వివరాలను.. పత్తి రైతులు తమ ఇంటి వద్దనే ఉండి తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు.
పత్తి రైతులందరూ మార్కెటింగ్ శాఖ తీసుకొచ్చిన ఈ వాట్సప్ నంబర్‌ను ఉపయోగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తిని విక్రయించుకోవాలని మంత్రి తుమ్మల తెలిపారు. పింజ రకము(బీబీ మోడ్) క్వింటాల్‌కు రూ.7521.. పింజ రకము (బీబీ ఎస్పీ ఎల్) క్వింటాల్‌కు రూ.7471.. పింజ రకము (మెక్) క్వింటాల్‌కు రూ.7421 గా పత్తికి కనీసం మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించినట్లు వెల్లడించారు. రైతులు పండించిన పత్తిలో తేమ 12శాతం మించకుండా ఉండాలని.. 8శాతం నుంచి 12శాతం మధ్య ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లభిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తికి తక్కువ మద్దతు ధర వస్తుందని.. అందుకే రైతులు పండించిన పత్తిని పూర్తిగా ఆరబెట్టి తేమ శాతం తక్కువగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విక్రయించేందుకు మార్కెటింగ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. అదే సమయంలో పత్తి రైతులు ఎలాంటి ఫిర్యాదులు చేసినా మార్కెటింగ్ శాఖ వెంటనే స్పందించి పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.