హైదరాబాద్ నగరంలో తొలి డబుల్ డెక్కర్, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేషనల్ హైవే 44పై రూ.1,580 కోట్ల వ్యయంతో 5.320 కిలోమీటర్ల కారిడార్ నిర్మించనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై మెట్రో సైతం అందుబాటులోకి రానుంది.
ఈ కారిడాడర్ సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ సమీపంలో మొదలై తాడ్‌బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫామ్ రోడ్డు వరకు నిర్మించనున్నారు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.650 కి.మీ కాగా.. అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.600 కి.మీ ఉంటుంది. మొత్తం ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కారిడార్ పనుల్లో కీలకమైన భూముల అప్పగింత ప్రక్రియ సాగుతోంది. ఈ కారిడార్లకు సంబంధించి ఇప్పటికే రక్షణ శాఖ భూములను హెచ్‌ఎండీఏకు అప్పగిస్తూ గతంలోనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నిర్మాణానికి ముందడుగు పడే ఛాన్స్ ఉంది.
రెండు రహదారుల్లో 200 మీటర్ల మేరకు రోడ్డు డైవర్షన్ చేయనున్నారు. డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ కోసం మొత్తం 73.16 ఎకరాలు అవసరమని హెచ్‌ఎండీఏ అంచనా వేస్తోంది. ఇందులో రక్షణ శాఖ నుంచి 55.85 ఎకరాలు సేకరించాల్సి ఉంది. 8.90 ఎకరాలు ప్రైవేటు ఆస్తులు ఉండగా.. వీటిని సేకరించేందుకు హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తోంది. ప్రైవేటు ఆస్తుల సేకరణలో భాగంగా వాటి యజమానులకు టీడీఆర్ ఇవ్వాలని హెచ్‌ఎండీఏ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే రోడ్డు వెడల్పు విషయంలో స్థానికుల నుంచి అభ్యంతాలు వ్యక్తం అవతుండగా... ఈ అంశాలను త్వరలో కొలిక్కి తెచ్చి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తామని అధికారులు చెబుతున్నారు.
కాగా ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే.. జాతీయ రహదారి-44లో సికింద్రాబాద్‌తోపాటు ఆదిలాబాద్ వైపు జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరం నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్‌ఆర్ వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. మేడ్చల్ - మల్కాజిగిరి - మెదక్ - కామారెడ్డి - నిజామాబాద్ - నిర్మల్ - ఆదిలాబాద్‌కు ప్రయాణికుల, సరకు రవాణా చేరవేత వేగంగా సాగుతుంది.