హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి మీడియాలో సోషల్ మీడియాలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో జరిగిన పార్టీ వ్యవహారం సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారం ఉదయం నుంచి రకరకాల వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు స్పందిస్తుండగా.. ఈ వ్యవహారంపై కేటీఆర్ స్పందించారు. "అది ఫామ్‌హౌస్ కాదు.. అది నా బావమరిది రాజ్ పాకాల ఉంటున్న ఇల్లు. అది ఫ్యామిలీ ఫంక్షన్. అసలు రేవ్ పార్టీ అంటే తెలుసా.. వృద్ధులు, చిన్నపిల్లలు కూడా అక్కడ ఉన్నారు. రేవ్ పార్టీ అని చెప్పి కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు." అంటూ కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.
ఉదయం నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం అవుతున్న వార్తల్లో నిజాలు లేవంటూ కేటీఆర్ ఖండించారు. పార్టీ జరిగింది ఫామ్ హౌస్ కాదని.. అది తన బావమరిది రాజ్ పాకాల ఇల్లని స్పష్టం చేశారు. మరోవైపు.. అది రేవ్ పార్టీ అంటూ చాలా మీడియాలు, సోషల్ మీడియాలు ప్రచారం చేస్తున్నాయనన్న కేటీఆర్.. అది పూర్తిగా ఫ్యామిలీ ఫంక్షన్ అని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.
స్వయంగా తన భార్య తమ్ముడైన రాజ్ పాకాల.. ఇటీవలే గృహప్రవేశం చేసుకున్నాడని.. ఆ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులను పిలిచి ఇంట్లో పార్టీ ఇచ్చినట్టుగా కేటీఆర్ వివరించారు. అదోక రేవ్ పార్టీ అని.. అందులో మహిళలు, పురుషులు పాల్గొన్నారంటూ రకారకాల వార్తలు ప్రచారం చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే.. ఆ పార్టీలో కుటుంబసభ్యులతో పాటు దగ్గరి స్నేహితులు పాల్గొన్నారని.. అందులో 4 ఏళ్ల చిన్న పిల్లల నుంచి 70 ఏళ్ల వృద్ధులు కూడా పాల్గొన్నారని వివరించారు. అందులో స్వయంగా తన అత్తమ్మ కూడా ఉన్నారని కేటీఆర్ వివరించారు.
రాజకీయంగా తనకు సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని.. తమను రాజకీయంగా ఎదుర్కోలేకనే.. తమ బంధువులపై కుట్రలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నిరంతరాయంగా పోరాటం చేస్తుందన్నారు. తాము ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే.. చావుకు తెగించి వచ్చామన్నారు. ఇలాంటి కుట్రలకు తాము భయపడమన్నారు. ఒక కుటుంబం.. తమ బంధువులతో కలిసి దావత్ చేసుకోవడమే తప్పు అంటున్నారని మండిపడ్డారు.