చలి పులి దెబ్బకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గజగజ వణికి పోతుంది. మూడు రోజులుగా అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. సాయంత్రం 6 గంటల దాటిందే చాలు ఈదురు గాలులతో చలి బెంబేలెత్తిస్తోంది. అర్ధరాత్రి మొదలు ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత రికార్డ్ స్థాయిలో నమోదు అవుతోంది.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాలు అయితే చలి పులి దెబ్బకు మరింత వణికి పోతున్నాయి. కొమరం భీం జిల్లా సిర్పూర్(యు)లో రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మూడు రోజులుగా సిర్పూర్(యు)లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం చలి మంటలతో సేదతీరుతున్నారు. మరోవైపు, ఉమ్మడి ఆదిలాబాద్ కు వాతవరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మూడు రోజులుగా చలి పులి వణికిస్తోంది. రికార్డ్ స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలను నమోదు చేస్తూ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం 10గంటలు దాటినా జనం బయటకు రావాలంటేనే జంకేలా, చలి తీవ్రత నమోదవుతోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) రాష్ట్రంలోనే రికార్డ్ స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేస్తోంది. మూడు రోజులుగా సింగిల్ డిజిటకే ఉష్టోగ్రత లు పడిపోవడంతో సిర్పూర్ యు గిరిజనం చలితో గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం ఆరు దాటిందంటే సిర్పూర్ యు లో ఎక్కడ చూసినా చలి మంటలే దర్శనం ఇస్తున్నాయి.తాజాగా సోమవారం(నవంబర్ 25) సిర్పూర్ యు లో 8.3 అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా.. రానున్న మూడు రోజుల్లో మరింత కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రత లు పడిపోతాయని హెచ్చరికలు జారీ చేసింది వాతవరణ శాఖ. కొమురంభీం జిల్లాలోని ఏజెన్సీ గూడాలైతే ఈదురు గాలులతో కూడిన చలి పులితో మరింత వణికిపోతున్నారు. కొమురంభీం జిల్లా లింగాపూర్ లో 10.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవగా.. కెరమెరి 10 డిగ్రీలు, వాంకిడి 11.2, గిన్నెదరి 11.2, కాగజ్ నగర్ 11.2, ఆసిఫాబాద్ లో 11.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.