దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, మహారాష్ట్రలో భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో సూచీలు వరుసగా రెండో రోజూ రాణించాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో సెన్సెక్స్ మళ్లీ 80వేల ఎగువకు చేరింది. నిఫ్టీ 24,200 పాయింట్ల ఎగువన స్థిరపడింది.సెన్సెక్స్ ఉదయం 80,193.47 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,117.11) లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 1300 పాయింట్లకు పైగా లాభపడి 80,473.08 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 992.74 పాయింట్ల లాభంతో 80,109.85 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 314.65 పాయింట్ల లాభంతో 24,221.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ కాస్త బలపడి 84.30కి చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో ఎల్అండ్టీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2672 డాలర్ల వద్ద కొనసాగుతోంది.