యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలోనే.. బీఆర్ఎస్ నేతలు తమదైన స్టైల్‌లో సీఎంకు, ప్రభుత్వానికి ప్రశ్నలు విసురుతున్నారు. యూనివర్సిటీకి ఇచ్చిన రూ.100 కోట్లను వద్దని చెప్పిన విషయాన్ని పక్కనపెడితే.. మరి తెలంగాణ ప్రభుత్వంతో, అదానీ గ్రూప్ కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందాల సంగతి ఏంటని నిలదీస్తున్నారు. గతంలో దావోస్‌లో అదానీ గ్రూప్‌తో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటని తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
అదానీ గ్రూప్ ఇచ్చిన విరాళాన్ని తిరస్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన రూ.100 కోట్లు నిధులు వెనక్కి తీసుకున్నారు సరే.. అదానీ అవినీతిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న వేళ.. దావోస్‌లో అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటని హరీష్ రావు ప్రశ్నించారు. అంతేకాకుండా తెలంగాణలోని డిస్కంలను అదానీ గ్రూప్‌కు అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు చేస్తున్న కుట్రల మాటేమిటి అని మండిపడ్డారు.
20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడుతామనే ప్రతిపాదనతో అదానీ గ్రూప్ వస్తే.. తాము మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించినట్లు హరీష్ రావు గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు నాలుకల విధానాన్ని పాటిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే.. గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచిందని హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్న అదానీతో.. రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం అదానీతో అవినీతి బయటికి రాగానే మాట మార్చేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా అదానీ గ్రూప్‌తో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
కొన్ని రోజుల క్రితం.. అదానీ గ్రూపు.. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ. 100 కోట్ల విరాళాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలు రావడం, అమెరికాలో కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న వేళ.. దేశంలో ఇండియా, ఎన్డీఏ కూటముల మధ్య తీవ్ర విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. బీజేపీకి, అదానీకి మధ్య సంబంధాన్ని చెబుతూ తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్న వేళ.. అదానీ గ్రూప్ ప్రకటించిన విరాళాన్ని తెలంగాణ సర్కార్ విరమించుకుంది.