ఒంట్లో ఏమాత్రం నలతగా అనిపించినా.. కాస్త గొంతు నొప్పి, దగ్గు, జ్వరం ఉన్నా చాలా మంది డాక్టర్‌ను సంప్రదించకుండానే మెడికల్ షాపులకు వెళ్లి యాంటీ బయాటిక్స్ వాడేస్తుంటారు. అది కూడా పూర్తి కోర్సు వాడకుండా ఒకి రెండ్రోజులు వాడి ఆపేస్తుంటారు. ఇలా చేయటం ప్రమాదకరమని ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ మోక్రోబయలాజిస్ట్ డాక్టర్ ఆర్సీ బిలోరియా హెచ్చరించారు. ఇలా చేయటం వల్ల యాంటీబయాటిక్స్ వివిధ రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగై, పరాన్న జీవుల మీద పనిచేయడం మానేస్తాయని అంటున్నారు. దీన్నే యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అంటారని వెల్లడించారు.
ప్రపంచ యాంటీమైక్రోబయల్ అవగాహన వారోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా నవంబర్ 18-24 వరకు నిర్వహిస్తారు. ఏఎంఆర్ గురించి ప్రజలు, వైద్యులు, ప్రభుత్వ పెద్దల్లో అవగాహన పెంచి, ఏఎంఆర్ మరింత విస్తరించకుండా నియంత్రించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. హైదరాబాద్ నగరంలో ఈ వారోత్సవాలు నిర్వహించగా.. మైక్రోబయలాజిస్ట్ డాక్టర్ ఆర్సీ బిలోరియా యాంటీబయాటిక్స్ వాడకంపై పలు సూచనలు చేశారు.
'ఏఎంఆర్ వల్ల ఇన్ఫెక్షన్లు ఒక పట్టాన తగ్గవు, వ్యాధులు విపరీతంగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. పలు రకాల యాంటీబయాటిక్స్‌కు లొంగని జీవులను మల్టీడ్రగ్ రెసిస్టెంట్ జీవులు లేదా సూపర్ బగ్స్ అంటారు. ప్రపంచంలో టాప్10 ఆరోగ్య ముప్పుల్లో ఒకటిగా ఏఎంఆర్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 1990 నుంచి ప్రతిఏటా సుమారు 10 లక్షల మంది ఏఎంఆర్ వల్ల మరణిస్తున్నారు. ఇప్పటికీ సరైన చర్యలు తీసుకుని దీన్ని నియంత్రించకపోతే ఇప్పట్నుంచి 2050 మధ్య 4 కోట్ల మంది ఇన్ఫెక్షన్లతో మరణిస్తారని గ్లోబల్ రీసెర్చ్ ఆన్ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ పరిశోధనలో తేలింది. ఏఎంఆర్ వల్ల చికిత్స సమర్థత తగ్గుతుంది, రోగులు ఆసుత్రిలో.. ఐసీయూలో ఎక్కువ కాలం ఉండాలి. వైద్యం ఖర్చు పెరిగిపోతుంది, ఒకరి నుంచి మరొకరికి మల్టీడ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది.' అని డాక్టర్ ఆర్సీ బిలోరియా వెల్లడించారు.
యాంటీబయాటిక్స్ ఇష్టారాజ్యంగా వాడడమే ఏఎంఆర్‌కు ప్రధానం కారణమని ఆమె తెలిపారు. డాక్టర్లకు చెప్పకుండా తమంతట తామే మందుల దుకాణాలకు వెళ్లి ఏదో ఒక యాంటీబయాటిక్ కొని తెచ్చుకుని పూర్తికాలం వాడకపోవడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. 'ఏ రకం సమస్యకు ఏ యాంటీబయాటిక్ వాడాలో డాక్టర్లు సూచిస్తారు. వాటిని అదే మోతాదులో వాళ్లు చెప్పినన్ని రోజులు వాడాలి. దీనివల్ల భావితరాలకు ప్రాణాలు కాపాడే యాంటీబయాటిక్స్‌ను అందుబాటులో ఉంచినట్లవుతుంది. లేకపోతే అవి ఇక పనిచేయడం పూర్తిగా మానేస్తాయి. వైద్యులు రాయకపోతే మీరు డిమాండ్ చేసి మరీ యాంటీబయాటిక్స్ రాయించుకోవద్దు. మిగిలిపోతున్నాయని చెప్పినన్ని రోజులు కాకుండా ఇంకా ఎక్కువ రోజులు వాడొద్దు.
వేరేవారికి రాసిన మందులు మనం వాడడం మంచిది కాదు. దానివల్ల వ్యాధి పెరిగి, దుష్ప్రబావాలు కూడా కలగొచ్చు. ఎప్పటికప్పుడు చేతులు సబ్బు, నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దగ్గినా, తుమ్మినా చేతులు గానీ కర్చీఫ్ గానీ అడ్డుపెట్టుకోవాలి. ఎక్కువ మంది జలుబు, దగ్గు, జ్వరం, బ్రాంకైటిస్, ఆయాసం, గొంతునొప్పి లాంటివాటికి యాంటీబయాటిక్స్ కొనుక్కొని వాడేస్తారు. కొందరు రోగులు తమ ఆర్థిక పరిస్థితి కారణంగా పూర్తి కోర్సు వాడకుండా కొంతే తీసుకుంటారు. అలాగే హాస్పిటల్‌లో కూడా పూర్తి కాలం ఉండానికి తగినంత డబ్బు లేక ముందే డిశ్చార్జి అయిపోతారు. కానీ దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్లు పూర్తిగా తగ్గకుండా.. యాంటీబయాటిక్స్ వాడినా లొంగని పరిస్థితి ఏర్పడుతుంది.' అని డాక్టర్ బిలోరియా తెలిపారు.
జలుబు అనేది వైరల్ ఇన్ఫెక్షన్ అని.. దాంతోపాటు వైరస్ వల్ల వచ్చే డయేరియా కూడా దానంతట అదే తగ్గిపోతుందన్నారు. యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియా మీద పనిచేస్తాయి గానీ వైరస్‌ల మీద ప్రభావం చూపవన్నారు. అందువల్ల జలుబు, డయేరియాలకు ఇవి వాడకూడదని సూచించారు. చాలావరకు బ్యాక్టీరియాలను టీకాలు నిరోధిస్తాయని చెప్పారు. టీకాలు తీసుకుంటే చాలావరకు యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరమే ఉండదని డాక్టర్ బిలోరియా సూచించారు.