హైదరాబాద్: హైదరాబాదీ బిర్యానీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. బిర్యానీ ప్రియులను హోటల్స్, రెస్టారెంట్ల నిర్లక్ష్యం భయపెడుతోంది.వరుస సంఘటనలతో బిర్యానీ తినాలంటేనే భాగ్యనగర వాసులు జంకుతున్నారు. ప్రముఖ బావర్చి హోటల్‌లో చికెన్ బిర్యానీలో సిగరెట్ పీకలు దర్శనమిచ్చాయి. గతవారం తాజ్ మహల్ హోటల్‌లో పన్నీర్ బిర్యానీలో జెర్రి కనిపించింది. అలాగే అల్వాల్ యతి హౌస్ హోటల్‌లోని బిర్యానీలో బొద్దింకలు కనిపించాయి. లోతుకుంటలో ఓ రెస్టారెంట్లో అరేబియన్ మందిలో బల్లి దర్శనమిచ్చింది. కుళ్ళిన చికెన్, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో బిర్యానీ తయారు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో వెల్లడైంది.ఈ ఫుడ్ పాయిజన్ కేసులతో నగరవాసులు ఆస్పత్రి పాలవుతున్నారు. బిర్యానీ తినే ఎక్కువ ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. వాంతులు, విరోచనాలు, లో బీపీ, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఆసుపత్రి పాలవుతున్నట్లు గుర్తించారు. ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్‌లో ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. సిటీలోని హోటల్స్ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదంటూ సర్వేల్లో వెల్లడైంది. 19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్‌లో హైదరాబాద్ ఉంది. గడిచిన రెండు నెలల వ్యవధిలో 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు హైదరాబాద్‌లో నమోదయ్యాయి. 62 శాతం హోటల్స్, గడువుతీరిన.. పాడైపోయిన.. కుళ్ళిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. బిర్యానీ శాంపిల్స్‌లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ బిర్యానీ ప్రతిష్ట దెబ్బతీసేలా హోటల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. హోటల్స్.. రెస్టారెంట్లలో మార్పు వచ్చేవరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్ణయించారు. మరో నెల రోజుల వరకు సిటీలో ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు కొనసాగునున్నాయి.ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఐటీలో నెంబర్ 1, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలో జాతీయ స్వచ్ఛ అవార్డులు పొందడంలో నెంబర్ 1. కానీ ఇప్పుడు కల్తీలో నంబర్ వన్ అయింది. బిర్యానీలకు ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీలో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 19 నగరాల్లో సర్వే చేసింది. కల్తీలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్‌లో గడిచిన రెండు నెలల వ్యవధిలో 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు నమోదు అయ్యాయని నివేదికలో తెలిపింది. పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ ఇలా అన్నింటినీ కల్తీ చేస్తున్నారు.