వాతావరణంలో వచ్చిన మార్పులు, చలి తీవ్రత పెరగడంతో ప్రజలు జ్వరాల బారినపడుతున్నారు.ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో వైరల్ ఫీవర్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రి, ఉదయం వేళల్లో చలి తీవ్రంగా ఉండడంతో ప్రజలు వైరల్ ఫీవర్‌తో పాటు దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రి జ్వరపీడితులతో కిటకిటలాడుతోంది. ఫీవర్ ఆస్పత్రిలో సోమవారం 568 మంది ఓపీ రిజిస్ట్రేషన్ కాగా వారిలో అత్యధిక శాతం వైరల్ ఫీవర్ బాధితులే ఉన్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం వంద మంది రోగులు ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతున్నారు.డెంగ్యూకేసులు కూడా నమోదవుతున్నాయి. శనివారం మూడు, సోమవారం మరో మూడు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. చలి తీవ్రత వల్ల వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాచి వడబోసిన నీటిని తాగాలని, బయట ఆహార పదార్థాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. డిసెంబర్ నెలలో చలి తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని, గుండె జబ్బులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు.
వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో వృద్ధులు, గుండె జబ్బులతో బాధపడే వారు వాకింగ్‌కు వెళితే తప్పనిసరిగ్గా మాస్క్ ధరించాలి. చలికాలంలో అందరూ జాగ్రత్తలు పాటించాలి. జ్వరం, దగ్గు సమస్యలు ఉన్నవారు వెచ్చని వాతావరణంలో ఉండాలి. అవసరమైతేనే బయటకు వెళ్లాలి. శీతల పానియాలు, ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండాలి. బయటకు వెళ్లినప్పుడు చెవిలో దూది తప్పనిసరిగ్గా పెట్టుకోవాలి.