ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీరాభిమానిని ఆశ్చర్యపరిచిన స్టాలిన్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 22, 2018, 09:16 AM

స్టాలిన్‌ను చూడాలనే కొండంత ఆశతో ఓ వయోధికురాలు పార్టీ కార్యాలయానికి వచ్చారు. కార్యకర్తల సమీక్షా సమావేశంలో బిజీగా ఉన్న ఆయన్ను చూసేందుకు సాధ్యపడక తిరిగి వెళ్లిపోయారు. అనంతరం ఆమెకు ఆహ్వానం పంపిన స్టాలిన్‌ ఆశ్చర్యపరిచారు. వివరాలు... ఈరోడు జిల్లాకు చెందిన పాపాత్తి (74) డీఎంకే వీరాభిమాని. కొద్దిరోజుల కిందట పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ చూడాలనే ఆకాంక్షతో చెన్నై చేరుకున్నారు.  అన్నా అరివాలయం వద్దకు వెళ్లారు. అప్పటికే పార్టీ కార్యకర్తలు, నిర్వాహకుల సమావేశంలో స్టాలిన్‌ ఉండటంతో ఆయన్ను ఎలాగైనా కలిసి వెళ్లాలని నిరీక్షించారు. అయినా ఫలితం దక్కలేదు. వెళ్లిపోవాలని కొందరు సూచించడంతో ఉస్సూరుమంటూ వెళ్లిపోయారు. ఈ విషయాన్ని కొన్ని వార్తాపత్రికలు ప్రచురించాయి.


దీంతో ఈరోడ్‌ జిల్లా పార్టీ నిర్వాహకుల ద్వారా పాపాత్తికి స్టాలిన్‌ ఆహ్వానం పలికారు. దీనిని ఊహించని ఆమె సంతోషంగా చెన్నై బయలుదేరారు. ఆళ్వార్‌పేటలోని తన నివాసానికి బుధవారం ఆమెను రప్పించుకుని తేనీటి విందు ఇచ్చారు స్టాలిన్‌. ఆమెతో సెల్ఫీ తీసుకోవడంతో పాపాత్తి ఉబ్బితబ్బిబ్బయ్యారు.  తర్వాత ఆమెతో కలిసి స్టాలిన్‌ గోపాలపురం చేరుకున్నారు. కరుణానిధి వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. ఏకంగా పార్టీ అధ్యక్షుడు, తన ఆరాధ్య దైవాన్ని నేరుగా, అదీనూ అతి సమీపంగా చూసే అవకాశం దక్కుతుందని కొంచెం కూడా ఊహించని ఆమె ఒక్కసారిగా తన్మయానికి గురయ్యారు. కరుణానిధి చేతిని అందుకుని ఆప్యాయంగా ముద్దాడారు. రెండు చేతులు పైకెత్తి ఆయనకు నమస్కారం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com