తెలంగాణ పట్ల వివక్ష చూపడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సోమవారం సిద్ధిపేటలో విలేకరులతో హరీశ్ రావు మాట్లాడారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ ప్రకటించడాన్నిహరీశ్ రావు తప్పుబట్టారు. తెలంగాణకు న్యాయబద్దంగా రావలసిన హక్కుల మాటేమిటి అని ప్రశ్నించారు. అరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉందన్నారు. జైరాం రమేష్ తాజా వ్యాఖ్యలే అందుకు ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పారు.
తెలంగాణకు అన్యాయం చేయడంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఒకేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అన్ని రంగాల్లో అన్యాయానికి గురైన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ కు ఎందుకు గుర్తు లేదని ప్రశ్నించారు. పోలవరంకు జాతీయ హోదా ఇచ్చి కాంగ్రెస్ ప్రాణహిత - చేవెళ్లకు మొండి చేయి చూపిందని మంత్రి విమర్శించారు. ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా ఇచ్చి ఉంటే తెలంగాణ ప్రభుత్వానికి ఈ రోజు అప్పులు తెచ్చే దుస్థితి ఉండేది కాదని హరీశ్ అన్నారు. ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు బస్సు యాత్ర చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జైరాం వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చిన తరువాతనే యాత్ర మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు.
జైరాం వ్యాఖ్యలను సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? అని రాష్ర్ట కాంగ్రెస్ నేతలను మంత్రి ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒకే రకంగా వ్యవహరిస్తున్నాయని నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు బీజేపీ జాతీయ హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిందని మండిపడ్డారు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలని అవమానించారని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాతం కాబట్టే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకుందని మంత్రి గుర్తు చేశారు. వెనకబడిన తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు ఇవ్వకుండా, అబివృద్ది చెందిన రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వెలిబుచ్చారు. కాళేశ్వరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ఎన్ని సార్లు కేంద్రానికి, ప్రధానికి విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యం వహిస్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa