ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి వేములవాడ శివకల్యాణోత్సవాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 03, 2018, 09:19 AM

వేములవాడ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం శివకల్యాణ మహోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి జరిగే ఈ వేడుకలకు ఆలయాధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 4న అభిజిత్ లగ్న ముహూర్తంలో ఆది దంపతుల కల్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించడానికి అన్నీ సిద్ధం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఆలయ ఈవో దూస రాజేశ్వర్ వెల్లడించారు. కామదహనం తర్వాత పరమశివుడు పార్వతిని పెళ్లి చేసుకునే వరకు సుమారు 16 ఏళ్లు తపస్సు చేశాడనీ.. మేనా, హిమవంతుల పుత్రికగా పార్వతీదేవి పెరిగి పరమశివుడి అర్ధాంగి అయ్యేందుకు ఘోర తపస్సు చేసి పెండ్లి చేసుకునే రోజును శివకల్యాణంగా పిలుస్తున్నారని ప్రతీతీ.


రాజన్న ఆలయ స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య ఆధ్వర్యంలో ఆలయ అర్చక బృందం శివ కల్యాణ మహోత్సవాన్ని అయిదు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మొదటిరోజు శనివారం ఉదయం 8:30 నుంచి శివభగత్పుణ్యాహవచనం, పంచగవ్య మిశ్రణం, దీక్షాధారణం, రుత్విక్ వరణం, మంటప ప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్ఠ, గౌరిషోడశ మాతృకా ప్రతిష్ఠ, మృత్సగ్రహణం, అంకురార్పణం, కుండ సంస్కారం, అగ్ని ప్రతిష్ఠ, స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వేదపారాయణములు, పరివార దేవతలకు దేవతార్చనలు నిర్వహించనున్నట్లు ఆలయ స్థానాచార్యులు వెల్లడించారు. 


సాయంత్రం 4 నుంచి స్వామివారి అద్దాల మంటపంలో శ్రీ శివపురాణ ప్రవచనం, రాత్రి 7 నుంచి భేరిపూజ, దేవతాహ్వానం, నీరాజనం, తీర్థప్రసాద వితరణ ఉంటుందని వెల్లడించారు. ఆదివారం ఉదయం 10:30 అభిజిత్ లగ్నసుముహూర్తమున ఆదిదంపతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, రాత్రి 8 గంటలకు ఆదిదంపతులను పెద్దసేవపై పురవీధుల గుండా ఊరేగిస్తారని ఆయన వివరించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa