అగర్తలా: త్రిపురలో హింస ప్రజ్వరిల్లింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. దీంతో గత 20 ఏళ్లుగా ఆ రాష్ర్టాన్ని పాలిస్తున్న లెఫ్ట్ పార్టీకి చుక్కెదురైంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొన్ని గంటల్లోనే బీజేపీ, లెఫ్ట్ మద్దతుదారులు ఘర్షణకు దిగారు. ఆ అల్లర్ల కారణంగా దక్షిణ త్రిపురలోని బెలోనియా పట్టణంలో ఉన్న మార్కిస్టు నేత లెనిన్ విగ్రహం ధ్వంసం అయ్యింది. బుల్‌డోజర్లతో లెనిన్ విగ్రహాన్ని బీజేపీ కార్యకర్తలు కూల్చివేశారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ వాళ్లు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. ఈ ఘటన పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఆ రాష్ట్ర గవర్నర్, పోలీస్ చీఫ్‌తో ఆయన మాట్లాడారు. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు హింస చోటుచేసుకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ ఆదేశించారు. గత 48 గంటల్లో మొత్తం ముగ్గుర్ని అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి అనేక అల్లర్లు చోటుచేసుకున్నట్లు ఫిర్యాదుల అందుతున్నాయి. రాష్ట్ర ప్రజల్లో బీజేపీ భయం సృష్టిస్తోందని సీపీఎం ట్వీట్ చేసింది.