న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఫర్నీచర్ దిగ్గం ఐకియా ఇండియా తన కంపెనీలో తల్లితండ్రులైన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకు మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వడమే చూశాం. కానీ, ఇప్పుడు పురుషులకు కూడా అలాంటి సెలవులు ఇచ్చేందుకు ఐకియా సంస్థ ముందుకు వచ్చింది. బిడ్డకు జన్మనిచ్చిన తల్లితోపాటు తండ్రికూడా 26వారాల పాటు పితృత్వ సెలవులను అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్‌లోని తమ సంస్థ ఉద్యోగులకు 26 వారాల పేరెంటల్ లీవ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగులకు సమానావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ హెచ్‌ఆర్ మేనేజర్ అన్నా కేరిన్ మాన్సన్ తెలిపారు.మహిళా ఉద్యోగులకు 26 వారాలకు వేతనంతోకూడిన సెలవుదినాలతోపాటు , మరో 16 వారాల పాటు పనిగంటల్లో 50శాతం కోత పెడుతున్నట్టు స్వీడిష్ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా ప్రకటించింది. సంస్థలో ఉద్యోగులందరికీ ఈ కొత్త విధానాన్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు తల్లులైన మహిళా ఉద్యోగులకు అదనపు సౌకర్యాలను కల్పించనున్నామని చెప్పారు. ట్యూబెక్టమీ చేయించుకున్న మహిళలకు అదనంగా మరో రెండువారాల సెలవు ఇస్తున్నట్టు చెప్పారు. ఒకవేళ గర్భధారణ, ప్రసవం కారణంగా అనుకోని అనారోగ్యం బారిన పడితే గరిష్టంగా ఒక నెలపాటు సెలవు ఇస్తున్నట్టు తెలిపింది. సరోగసీ, దత్తత మార్గాన్ని అనుసరించిన వారికి కూడా ఈ పాలసీ వర్తిస్తుందని కంపెనీ చెప్పడం గమనార్హం. 50/50 లింగ సమతుల్యతను సాధించే దిశగా తాము కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగుల పిల్లల కోసం ప్రతీ స్టోర్‌లో డేకేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది హైదరాబాద్‌లోనే తమ సంస్థ తొలి స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది.