-మధ్యాహ్నానికి చండిపచండంగా మారుతున్న సూరిడు
-వడదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రజలు
-కొబ్బరి బొండాలకు రోజురోజుకు పెరుగుతున్న గిరాకీ
కరీంనగర్-సూర్యప్రత్యేకప్రతినిధి : మార్చి మొదటి వారానికే ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపం రోజురోజుకు తీవ్రమవుతుంది. 10 రోజులుగా పెరిగిన ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 గంటలకే సుర్రుమనిపించే సూరిడు.. మధ్యాహ్నానికి చండిపచండంగా మారు తున్నాడు. ఈ ఎండవేడిమి తట్టుకోలేక చాలా మంది బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సిన వారు ఎండకు తాళలేక శీతల పానియాలను సేవిస్తున్నారు. పండ్లు, పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు, మజ్జిగ, అంబలి, సోడా, తదితరాలతో సేదతీరుతున్నారు. తద్వారా కాసింత ఉపశమనం పొందుతున్నాడు. వడదెబ్బ బారినపడకుండా వీటిని తాగుతు ప్రజలు జాగ్రత్త పడుతున్నారు. కొబ్బరి బొండాలకు గిరాకి పెరిగింది. కొబ్బరి నీటిలో మంచి లవణాలు ఉన్నందున ఎక్కువమంది వీటిని తాగేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా కాపడడంతో కొబ్బరి నీరు ప్రధాన పాత్ర పోషిస్తోంది. కేరళతోపాటు, చిత్తురు, కడప, నెల్లురు, వరంగల్ జిల్లా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు. కొబ్బరినీటిని తాగితే శరీరంలో కోల్పోయిన కార్పోహైడ్రెట్‌లు తిరిగి భర్తీ అవుతాయి. బడలికతో ఉన్నవారికి ఆరోగ్యపరంగా ఎంతో శ్రేయస్కరం.
జ్యూస్‌ల జోరు...
జ్యూస్‌లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు అంటున్నారు. గొంతు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. వేసవి ఉష్ణోగ్రతల నేఫత్యంలో పట్టణాలతో పాటు మండల కేంద్రాలతో పాటు గ్రామాల శివారులలోని రహదారుల పక్కన ప్రత్యేకంగా జ్యూస్ సెంటర్లు వెలిశాయి. ఇందులో ఆరెంజ్, సపోటా, అరటి పైనాపిల్, ఆపిల్, దానిమ్మ, గ్రేప్ తదితర జ్యూస్‌లను తయారు చేసి విక్రయిస్తున్నారు. గ్లాస్ జ్యూస్‌లను రూ.20చొప్పున విక్రయిస్తున్నారు. పుచ్చకాయల జ్యూస్... వేసవి వచ్చిందంటే చాలు ఎక్కడపడితే అక్కడ పుచ్చకాయలు దర్శనమిస్తాయి. దీన్ని ముక్కలుగా తినడంతోపాటు జ్యూస్‌గా తయారు చేసి తాగొచ్చు. రక్తపోటు నివారణకు దోహదపడుతుంది. శరీరానికి అవసరమైన నీటిశాతాన్ని అంది స్తుంది. ఎండలకు శరీరంలో తగ్గేనీటిని వీటితో భర్తీ చేసుకోవచ్చు.
దాహర్తి తీర్చే గోలి సోడా...
చిన్న తోపుడు బండ్లపై గ్లాస్ బండతో కనిపించే గోలి సోడా తాగితే ఎండ దెబ్బనుంచి తక్షణం ఉపశమనం పొందవచ్చు. ఇవి స్వీట్లు,సాల్‌ట క్రష్‌లలో లభ్యమవుతున్నాయి. సోఓడాకు నిమ్మరసం జత చేసి తయారు చేస్తారు. గ్లాస్ గోలి సోడా ధర రూ.5 నుంచి రూ.10 వరకు విక్రయిస్తున్నారు.వాంతులు, కడుపులో ఉబ్బసానికి బాగా పని చేస్తోందని వైద్యులు చెబుతున్నారు.
కుంబ లస్సి...
జిల్లాలలో చాలా చోట్ల కుండ లస్సి అమ్మకాలు పెరిగాయి. పెరుగుతో తయారు చేసే లస్సి తాగితే శరీరానిక చక్కటి కాంతితో పాటు ఎండ నుంచి ఉపశమనం పొందవచ్చు.లస్సిని కుంటలో నిల్వబెట్టి మిక్సిలో వేసి చిలకరించి క్యారెట్, కొబ్బరి, చెర్రితో పాటు మీగడ జత చేసి ఇస్తున్నారు. వేసవి దృష్యా పలుచోట్ల ప్రధానకూడళ్లలో కుండ లస్సిని బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారు.
భలే రుచి...చెరకు రసం...
సీజన్‌తో తేడా లేకుండా చెరకు రసాలకు గిరాకి ఎక్కువగా ఉంది. ఎండలో తిరిగే వారికి శరీరంలో గ్లూకోజ్ శాతం తగ్గి నీరసం వస్తుంది. అలాంటప్పుడు చెరకు రసాన్ని తాగితే నీరసంతగ్గి మళ్లి ఉత్సాహం వస్తుంది. అలాగే సుగంధ ద్రవ్యాల జ్యూస్‌కు గిరాకి ఉంది. శరీరానికి మంచి గుణాలు కలిగిన జ్యూస్ ఇది. వడదెబ్బకు బాగా పని చేస్తుంది.
తాటి ముంజు...
వేసవిలో మాత్రమే దొరికేది తాటి కాయ ఒకటి. ఇది కూడా ప్రకృతి ప్రసాద మేనని చెప్పాలి. ఎండాకాలంలో చక్కటి జౌషదంలా పని చేస్తుంది. ముఖ్యంగా తాటి ముంజె వేసవికి శ్రేష్ణమైనది. తాటి ముంజె పైపొర చాలా మంది తీసివేసి లోపలి తెల్లటి పదార్థాన్ని మాత్రమే తింటారు. పైపొర తింటే అరుగుదల ఉండ దనేది అపోహ, అయితే ఈ పైపొరలోనే ఎక్కువగావిటమిన్‌స, మినరల్‌స ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఒక లోపలి తెల్లటి పదార్థం ఎండ తాపం నుంచి రక్షణ కల్పిస్తుంది.
మండుటెండలో మజ్జిగతో ఉపశమనం..
ఎండలు మండే ఈ కాలంలో మధ్యాహ్నం బయటకు తిరిగేవారు. తిరిగి తిరిఇ వచ్చిన వారు ఓ గ్లాసుడు చల్లని మజ్జిగ తాగితే ఎంతో మేలు. దేహానికి మజ్జి చేసే మేలు అంతా ఇంతా కాదు. పేగులకు పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్లివంటి పదర్థాలు ఇందులో ఉంటాయి. విరోచనాలు, వాంతులు, అధికధాహం వంటి సమస్యలు లేదా నీరసం, కాళ్లు, చేతులు తిమ్మిర్లు తలెత్తినప్పుడు మజ్జిగలో ఉప్పుకాని, పంచదార కాని వేసుకుని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. మజ్జిగ విక్రయానికి రూ.10కి గ్లాస్ చొప్పున విక్రయిస్తున్నారు.
5 లీటర్లకు పైగా నీరు తాగండి...
వేసవిలో ఎండ తీవ్రతను తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు ఐదు లీటర్లకుపైగా నీరు తాగాలి. అది జూస్‌ల రూపంలో గాని, పండ్లు తినడం ద్వారా గాని, సాధారణ నీరు తాగడం ద్వారా గానీ చేయవచ్చు. వేసవిలే నీరు తక్కువగా తాగడం వలన మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఎండకాలం తరుచుగా నీరు తాగుతు ఉండాలి. కూల్‌డ్రింక్‌స కంటే పండ్ల రసాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కూల్‌డ్రింక్‌సలలలో పురుగు మందులు ఉండడంతో కిడ్ని సంబంధిత రోగాలు రావచ్చు. పండ్ల రసాలు కూడా ఇళ్లలో తయారు చేసుకుని తాగితే మరీ మంచిది.