హైదరాబాద్ : గుండె జబ్బులకు సంబంధించిన స్టంట్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గుండె జబ్బులకు సంబంధించిన స్టంట్ల విషయంలో దోపిడీని అరికడుతున్నామని స్పష్టం చేశారు. స్టంట్ల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. సంట్ల ధరల నియంత్రణ పాటించేలా ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికీ 36 ఆస్పత్రులను తనిఖీలు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఆస్పత్రులపై ధరల విషయంలో ఎలాంటి నియంత్రణ లేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ధరల విషయంలో నియంత్రణ తీసుకొచ్చామని చెప్పారు. స్టంట్ల విషయంలో ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అవసరం లేకుండా సర్జరీలు చేయొద్దని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా ఇప్పటికే 9 ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అనవసరంగా సర్జరీలు చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమ్స్ ఆస్పత్రిని ఆధునీకరిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో నిమ్స్ తరహాలో మరో మూడు ఆస్పత్రులను నిర్మిస్తామని స్పష్టం చేశారు.