హైదరాబాద్ : గ్రామాలు స్వయం అభివృద్ధి సాధించాలని గ్రామజ్యోతి పథకాన్ని ఏర్పాటు చేశామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ... గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 2015-16, 2016-17లో రూ. 875 కోట్లు గ్రామజ్యోతి పథకం కింద గ్రామాల అభివృద్ధి పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బీటీ రహదార్లు వేస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 4800 కోట్లతో రహదారులు నిర్మించామని తెలిపారు. 8,222 గ్రామాలకు బీటీ రోడ్లు వేశామన్నారు. మిగిలిన 3027 గ్రామాలకు రహదార్లు వేస్తామని ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి డబుల్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.