నీవంటే నాకు ఇష్టం లేదు.. కావాలంటే ఇంకొకరితో వివాహం చేయిస్తా.. లేకుంటే ఎక్కడికైనా పోయి చావు అంటూ ఇంటి నుంచి భార్యను బయటకు పంపించాడు. పుట్టింటికి వెళ్లిన ఆమెకు తల్లిదండ్రుల అనారోగ్య పరిస్థితిని చూసి మళ్లీ భర్త వద్దకు వచ్చింది. ఇంటికి తాళం వేసి భర్త ఎటో వెళ్లిపోయాడు. రెండు రోజులుగా ఆమె భర్త ఇంటిముందు ఉంటోంది.
పాతబస్తీ అలియాబాద్‌కు చెందిన శంకర్-యమున దంపతుల కుమార్తె స్వప్న(28). ఆమెను బీఎస్సీ వరకు చదివించి 2015లో అడిక్‌మెట్‌కు చెందిన విజయ్(32)తో వివాహం చేశారు. విజయ్ ఎంబీఏ పూర్తిచేసి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మూడు నెలలు మంచిగానే ఉన్న విజయ్ తర్వాత నీవంటే నాకు ఇష్టం లేదు.. పుట్టింటికి వెళ్లమని వేధించసాగాడు. ఏడాది క్రితం బెంగళూరులో ఉద్యోగం వచ్చిందని చెప్పి స్వప్నను ఆమె పుట్టింట్లో వదిలిపెట్టాడు. హైదరాబాద్‌లోనే ఉంటున్నాడని తెలిసి స్వప్న అతని వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తే ఇంటికి రావద్దని బెదిరించడంతో ఆమె మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మూడుసార్లు కౌన్సెలింగ్‌కు వచ్చిన విజయ్ తన భార్యను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి, ఆ తర్వాత కొద్ది రోజులకే కోర్టులో విడాకులు కావాలని కేసు వేశాడు. తనకు న్యాయం చేయాలని భర్త వద్దనే ఉంటానని ఆమె జడ్జిని వేడుకోవడంతో లీగల్ అథారిటీ వలంటీర్ పద్మ ఆమెను భర్త వద్దకు సోమవారం తీసుకువచ్చింది. విషయం తెలుసుకున్న అతను ఇంటికి తాళం వేసి వెళ్లాడు. బాధితురాలు భర్త ఇంటి ముందే ఉంటోంది. విషయం తెలుసుకున్న ముషీరాబాద్ పోలీసులు మంగళవారం విజయ్‌ను ఠాణాకు పిలిపించి మాట్లాడారు. తనకు ఇష్టం లేదని కావాలంటే మరో పెళ్లి చేస్తానని చెప్పడం గమనార్హం. తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసుల ముందు విలపించింది. కుటుంబ సభ్యులు కలిసి చర్చించుకుని నిర్ణయానికి రావాలని, లేకుంటే మరోసారి కౌన్సెలింగ్ కోసం మహిళా ఠాణాకు పంపిస్తామని ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa