ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డెలివరీ బాయ్‌పై అన్నాచెల్లెలు కలిసి దాడి

Telangana Telugu |   | Published : Fri, Mar 30, 2018, 11:57 AM

సెల్‌ఫోన్ డెలివరీ ఆసల్యమైందని.. డెలివరీ బాయ్‌పై అన్నాచెల్లెలు కలిసి దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా ఆ బాయ్‌పై పదునైన కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని నిహాల్ విహార్‌లో మార్చి 21న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కమల్ దీప్(30) అనే యువతి ఆన్‌లైన్‌లో రూ. 11 వేల విలువ చేసే సెల్‌ఫోన్‌కు ఆర్డర్ చేసింది. అయితే సెల్‌ఫోన్‌ను డెలివరీ చేయడంలో ఆలస్యమైంది. అప్పటికే ఫోన్ డెలివరీ ఎందుకు ఆలస్యమైతుందని డెలివరీ బాయ్ కేశవ్ కుమార్ సింగ్(21)కు పదేపదే ఫోన్ చేసింది కమల్ దీప్. మొత్తానికి సెల్‌ఫోన్‌తో ఇంటికి వచ్చిన డెలివరీ బాయ్‌పై కమల్ దీప్, ఆమె సోదరుడు జితేందర్ సింగ్(34) ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్‌ను డెలివరీ చేయడంలో ఎందుకు ఆలస్యమైందని ఆ బాయ్‌పై యువతి కన్నెర్రజేసింది. అంతటితో ఆగకుండా షూ లేస్‌తో బాయ్ గొంతుకు కట్టేసి హత్యాయత్నం చేసింది. కేశవ్ కుమార్ సింగ్ కడుపుపై కూర్చొని విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసింది. అన్నాచెల్లెలు కలిసి సింగ్ శరీరంపై 20 చోట్ల కత్తితో పొడిచారు. డెలివరీ బాయ్ ప్రైవేటు పార్ట్స్‌ను కత్తితో కట్ చేసేందుకు యత్నించగా.. సోదరుడు జితేందర్ సింగ్ అడ్డుకున్నాడు. 


సుమారు 20 నిమిషాల పాటు తీవ్రంగా కేశవ్ కుమార్ సింగ్‌ను హింసించారు. ఈ క్రమంలో సింగ్ స్పృహ కోల్పోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న డెలివరీ బాయ్ చనిపోయాడని భావించి.. ఇంటి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేశారు. డ్రైనేజీలో పడి ఉన్న కేశవ్ కుమార్ సింగ్‌ను ఓ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సింగ్ శరీరంపై మొత్తం 45 కుట్లు వేశారు. చేయి విరగడంతో కట్టు కట్టారు. కేశవ్ కుమార్‌సింగ్‌పై దాడి చేసిన కమల్ దీప్, జితేందర్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ సందర్భంగా బాధితుడు కేశవ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఇది తనకు పునర్జన్మ అని తెలిపారు. 20 నిమిషాల పాటు తనను తీవ్రంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అరుపులు బయటకు వినిపించకుండా వారి ఇంట్లో ఉన్న థియేటర్ స్పీకర్స్‌ను ఆన్ చేశారు. తన నోట్లో కత్తిని కూడా పెట్టేందుకు ఆమె యత్నించింది. ఆ 20 నిమిషాల సమయాన్ని తాను జీవితంలో మర్చిపోలేను అని చెబుతూ కేశవ్ కన్నీటి పర్యంతమయ్యాడు.  










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa