ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి మలిదశ యాత్ర

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 31, 2018, 10:40 AM

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండో దశ బస్సు యాత్ర ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ యాత్ర ఏప్రిల్ 10వ తేదీ వరకు సాగనుంది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు రామగుండంలో భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. మొదటి దశలో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 9 వరకు ఉత్తమ్ బస్సు యాత్ర నిర్వహించి.. అసెంబ్లీ సమావేశాల కోసం విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ప్రారంభమైన తొలిరోజు ఈ నెల 12నే గవర్నర్ ప్రసంగం సమయంలో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా జరిగిన సంఘటనతో శాసన సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్  కుమార్ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు. మొత్తం కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి పూర్తిగా సస్పెండ్ చేశారు. దీంతో ముఖ్యమైన బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యులు లేకుండానే సభ నడిచింది. బడ్జెట్ సమావేశాల చివరి రోజు కాగ్ నివేదిక సభలో పెట్టారు. అనేక విషయాల్లో విపక్షాలు చాలా కాలం నుంచి చేస్తున్న విమర్శలకు బలం చేకూరేలా కాగ్ నివేదికలో పలు అంశాలు ఉన్నాయి. శాసనసభ సమావేశాలు ముగియగానే మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే కాంగ్రెస్ యాత్రకు సిద్ధమైంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బలాన్నిచ్చేలా ఉన్న కాగ్ నివేదికను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన ఎజెండాగా ఉత్తమ్ యాత్ర సాగబోతోంది. ప్రభుత్వ వైఫల్యాలను అడుగడుగునా ఎండగట్టాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. ధనిక రాష్ట్రమని, మిగులు రాష్ట్రమని, ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేశామని, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ దేశంలోనే ఆదర్శవంతమైనవని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న వాదనలోని డొల్లతనాన్ని కాగ్ రిపోర్టు బయట పెట్టిందని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ అంశాలను సవివరంగా ప్రజల ముందు పెట్టడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందని చెబుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయని, ప్రభుత్వమే శాసన సభలో ప్రకటించిన విధంగా ఇప్పటి వరకు కేవలం 9,522 మాత్రమే పూర్తి చేశామని చెప్పారని, ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని ఓ సీనియర్ నాయకుడు చెప్పారు.


మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ప్రధానంగా ఇద్దరు సభ్యుల సభ్యత్వాల రద్దు అంశాన్ని ప్రజలకు వివరించనున్నారు. శాసన సభకు మొదటిసారి ఎన్నికైన దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు సంపత్ సభ్యత్వాన్ని ఎలాంటి కారణం చూపకుండానే రద్దు చేయడాన్ని గట్టిగా ఎండగట్టాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. కేవలం రాజకీయ కక్షతోనే ఈ ఇద్దరి సభ్యత్వాన్ని రద్దు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. టీఆర్‌ఎస్‌లో చేరాలని ఈ ఇద్దరిపై ఒత్తిడి చేశారని, అది కుదరకపోవడంతోనే మండలి చైర్మన్‌పై దాడి చేశారన్న కారణం చూపి సభ్యత్వాలను రద్దు చేశారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై కోర్టులో విచారణ సందర్భంగా ఆ రోజుల సభా కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి వీడియో ఫుటేజీని సమర్పించేందుకు కుంటిసాకులు చెబుతున్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa