ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం మాటలతో కాలం గడుపుతుంది : కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 03, 2018, 01:37 PM

భద్రాద్రి కొత్తగూడెం : బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం మాటలతో కాలం గడుపుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కొత్తగూడెంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, ఆరోగ్యలక్ష్మీ సెంటర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. కేంద్రం స్పందించకపోయినా సింగరేణి, టీఎస్‌ఎండీసీ కలిసి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఏ ఉక్కు లేని విశాఖలో స్టీల్ ప్లాంట్ పెట్టారు. ఛత్తీస్‌గఢ్ నుంచి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖకు ముడి ఉక్కును తరలిస్తున్నారు. కానీ ఛత్తీస్‌గఢ్‌కు 180 కిలోమీటర్ల దూరంలో బయ్యారం ఉన్న ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. 




కొత్తగూడెం అభివృద్ధి విషయంలో ముందంజలో ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. కొత్తగూడెం నిరంతరం అభివృద్ధిని కాంక్షించే ప్రాంతమని చెప్పారు. కొత్తగూడెంను జిల్లా చేసి ఇక్కడి ప్రజల చిరకాల కోరికను తీర్చామని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల అధికార వికేంద్రీకరణ జరిగిందన్నారు. మారుమూల ప్రాంతాల ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం అవుతున్నాయన్నారు. అభివృద్ధి విషయంలో కొత్తగూడెం హైదరాబాద్‌తో పోటీ పడుతుందన్నారు. ఇందుకు ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ కృషి చేస్తున్నారని తెలిపారు. కొత్తగూడెంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. జాన్‌డీర్, ఐటీసీ లాంటి సంస్థలు యువతకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఈ ప్రాంత యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కొత్తగూడెంలో విమానాశ్రయం నెలకొల్పేందుకు సీఎం పచ్చ జెండా ఊపారని కేటీఆర్ గుర్తు చేశారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. కొత్తగూడెం, పాల్వంచను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa