ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత సాన్నిహిత్యంగా ఉన్నారో చూస్తే ఆశ్చర్యపోతారు. అమెరికా పర్యటనకు వెళ్లిన మెక్రాన్ మంగళవారం అమెరికా అధ్యక్ష నివాసంలోని ఓవెల్ కార్యాలయంలో ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఆ సమయంలో మెక్రాన్ కాలర్‌పై కొద్దిగా డాండ్రఫ్ దుమ్ము ఉండడం చూసి ట్రంప్ దాన్ని తుడిచారు. ట్రంప్ అలా చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మెక్రాన్ కాలర్‌పై ఉన్న డాండ్రఫ్ తుడుస్తూ.. తమ మధ్య చాలా ప్రత్యేకమైన బంధం ఉందని అన్నారు. ‘ఆయన కాలర్‌పై డాండ్రఫ్ తుడిచాను.. నిజానికి మేము ఆయనను పర్ఫెక్ట్గా ఉంచాలి. ఆయన పర్ఫెక్ట్’ అని ట్రంప్ అనడంతో మెక్రాన్ నవ్వుతూ కనిపించారు.
ట్రంప్‌తోపాటు ఫస్ట్‌లేడీ మెలానియా ట్రంప్ మెక్రాన్ దంపతులను శ్వేతసౌధంలోకి ఘనంగా ఆహ్వానించారు. ఇరువురి నేతల సమావేశం అనంతరం సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వచ్చేప్పుడు కూడా ట్రంప్, మెక్రాన్‌లు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడుస్తూ వెళ్లారు. అది కాస్త ఇబ్బందికరంగా కనిపించింది. అంతేకాకుండా ఇరువురు నేతలు ఆప్యాయంగా ముద్దాడారు కూడా. కాన్ఫరెన్స్ తర్వాత కూడా పోడియం నుంచి దిగేప్పుడు మెక్రాన్ తన కుడి చేతితో ట్రంప్‌ను వెనుకగా పట్టుకుని ఆయన భుజం తట్టారు. ఇలా పలుమార్లు ఒకరిని ఒకరు పట్టుకుని చాలా దగ్గరగా కనిపించారు. ట్రంప్, మెక్రాన్‌లు ప్రవర్తించిన తీరు వారి మధ్య, రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధాన్ని తెలియజేస్తోందని పలువురు అంటున్నారు.