న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదా అంటే ఏమిటి? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ అంటున్నారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటో రాహుల్ గాంధీ వివరించాలని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఎంపీ వినోద్ ప్రసంగించారు. హోదా ఇచ్చినప్పుడు పన్ను మినహాయింపులు ఇస్తారా? లేదా? అని రాహుల్‌ను ప్రశ్నించారు. తమకు కూడా పన్ను మినహాయింపులు ఇస్తారా? అని అడిగారు. ఎందుకంటే తమకు మోసపోవాలని లేదన్నారు. అసలు ప్రత్యేక హోదా అంటే ఏమిటో నిర్వచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దానికంటూ ఓ చట్టం కూడా లేదని వినోద్ తెలిపారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటో స్పష్టత ఇవ్వాలని తెలిపారు. ప్రత్యేక హోదాకు నిధులు ఇస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని వినోద్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటో కాంగ్రెస్, బీజేపీ నిర్వచనాన్ని చెప్పాలన్నారు. తమ డిమాండ్లకు ప్రధాని మోదీ, రాహుల్ సమాధానం ఇవ్వాలని వినోద్ డిమాండ్ చేశారు.