ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్కెట్‌లో జెండాపాట ఓ బోగస్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 06, 2017, 12:17 PM

మార్కెట్‌లో జెండాపాట ఓ బోగస్‌ రైతుల కడుపు మంటతోనే మార్కెట్‌లో ఆందోళన ఖమ్మంలో భాజపా శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి ఈనాడు, ఖమ్మం: ఖమ్మం మిరప మార్కెట్‌లో జెండాపాట ఓ బోగస్‌ అని, జెండాపాటకు 1-2 శాతం సరకు, మిగతా 99-98 శాతం మరింత తక్కువ ధరకు మిరపను కొనుగోలు చేస్తున్నారని భాజపా శాసన సభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.ఖమ్మం జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సీజన్‌ ప్రారంభంలో పత్తికి ప్రత్యామ్నాయంగా కంది, మిరప సాగు చేయాలని అసెంబ్లీలో, అసెంబ్లీ బయట ముఖ్యమంత్రి సహా మంత్రులు చెప్పారని గుర్తు చేశారు. రైతులు స్పందించి పంట వేస్తే భారీ దిగుబడులు వచ్చాయని, కానీ కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఖమ్మం మార్కెట్‌లో అప్రకటిత సెలవులు, వరంగల్‌లో తెరాస సభ ఉంటే కూడా సెలవు ఇచ్చే దుస్థితి దాపురించిందన్నారు.వరుస సెలవుల కారణంగా ఖమ్మం మార్కెట్‌కు పెద్దఎత్తున మిరప వచ్చిందని, అన్ని దారుల్లో బస్తాలు వేయాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సరకు కొనుగోలు చేయాల్సిందన్నారు. అధికారులు, పాలకవర్గం కుమ్మక్కయ్యి అవకాశం చూసుకొని ధరను తగ్గించారని ఆరోపించారు. ఫలితంగా కడుపుమండిన రైతులు ఆందోళనకు దిగారన్నారు.రైతు నవ్వాలి.. అంటూ ప్రగతి భవన్‌లో సమీక్షలు నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన మంత్రివర్గం రైతులను రౌడీలుగా సంబోధిస్తోందన్నారు. రైతును రాజును చేస్తానని చెప్పి, జైలుకు పంపించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై రైతు వ్యతిరేకతను చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలే కుట్ర పన్నాయని తెరాస ఆరోపిస్తోందన్నారు.ఎరువుల ధరలు గతంలో కంటే రూ.100 నుంచి రూ.200 వరకు తగ్గాయని, దేశంలో అన్నీ రాష్ట్రాల్లోనూ నిరంతర విద్యుత్తు సరఫరా అవుతోందని ఇదంతా ప్రధాని మోదీ ఘనతగా వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరెంటు యూనిట్‌కు రూ.14 ఉంటే ఇపుడు రూ.2.14లకే లభిస్తోందన్నారు. ఉత్పత్తి పెంచడం కేంద్రం ఘనతన్నారు. ఖమ్మం జిల్లాలో ఫుడ్‌పార్కు, కరీంనగర్‌, రామగుండంలో ఎరువుల కర్మాగారాలను కేంద్రం పునరుద్ధరిస్తోందన్నారు.కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు కానీ పథకాలను ప్రకటిస్తూ ప్రజానీకాన్ని మభ్యపెడుతోందన్నారు. 2018లో ఇచ్చే ఎకరానికి రూ.4 వేలకు సంబంధించి ఇప్పటి నుంచే హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో భారీ హోర్డింగులు, ప్రచారప్రకటనలు ఇస్తోందని ఎద్దేవా చేశారు. ఎపుడో ఇచ్చే వాటి గురించి కాదు.. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో మిరప రైతుకు మంచిధర కల్పించాలని డిమాండ్‌ చేశారు.కేంద్రం రూ.6,250 ఇస్తోంది.. రాష్ట్ర ప్రభుత్వం ఎంత బోనస్‌ ఇస్తుందో స్పష్టం చేయాలన్నారు. మిరప రైతులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్ని గ్రామాల్లో నిలదీయాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌ప్రతాప్‌ మాట్లాడుతూ..ఖమ్మం మార్కెట్‌లో భారీగా అక్రమాలు చోటు చేసుకొంటున్నాయన్నారు. రైతుల వద్ద రూ.3 వేలకు మిరపను కొనుగోలు చేసిన సమీప ఫ్యాక్టరీలో రూ.7 వేలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ు సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి, కిసాన్‌ మోర్చా జాతీయ కార్యదర్శి సుధాకర్‌రావు, భద్రాదికొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, సత్యనారాయణ, విద్యాసాగర్‌, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, రుద్రప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా ఖమ్మం నగరంలోని ఓ హోటల్‌ నుంచి మార్కెట్‌కు బయలుదేరి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలోని భాజపా బృందాన్ని పోలీసులు అరెస్టు చేశారు.ఖమ్మం గ్రామీణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కిషన్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం కిషన్‌రెడ్డిని విడిచెపెట్టారు. ఖమ్మం జైలులో ఉన్న రైతులను, జైలు ఆవరణలోని బాధిత కుటుంబీకులతో కిషన్‌రెడ్డి మాట్లాడారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com