ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలల ఆరోగ్య వికాసానికి చర్యలేవీ?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 11, 2017, 04:10 AM

- వ్యాధి నిరోధక టీకాలు ప్రతి బాలుడి జన్మ హక్కు


- 2020 కల్లా దేశంలోని 90 శాతం పిల్లలకు టీకాల్ని అందించాలని ప్రభుత్వ లక్ష్యం


 - అరుుదేళ్ల లోపు పిల్లలకు టీకాలపై దృష్టి సారించాలి


 - టీకాల పంపిణీని ఉద్యమ రూపంలో ముందుకు తీసుకువెళ్లాలి


బాలలు జాతి సంపద... వారి మనోవికాసమే భవిష్య దేశ ప్రగతికి బంగారు బాట... పేదరికం శాపమే. అదే శాపం బాలలకు అంటుకుంటే దేశ భవిత సర్వనాశనం కాక తప్పదు. పేదరికంతో వచ్చే ముఖ్యమైన సమస్యలు రెండు. ఒకటి... ఆకలితో అలమటించడం రెండోది అనారోగ్యాల బారిన పడడం. మన దేశంలో పేదరికంతో మగ్గుఉతున్న బాలలకు సరైన ఆరోగ్యసౌకర్యాలు లభించడం లేదన్నది కఠోర వాస్తవం. పేదరి కంతో పాటు ఆవిద్య కూడా అధిక శాతం బాలలకు ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతోంది. కోట్లాది రూపాయలు ఆరోగ్య పథకాలపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్నప్పటికీ... భారతదేశంలో అనారోగ్య పరిస్థితుల్లో ఉసురుకోల్పోతున్న బాలల సంఖ్యకు కొదువ లేకుండా పోతోంది. ముఖ్యంగా ఆరోగ్య టీకాలు అందాల్సిన సమయంలో అధికులకు అందడం లేదు. ఒక నివేదిక ప్రకారం మన దేశంలో సమగ్ర టీకాలు అందని బాలల సంఖ్య 2 కోట్ల పైనే ఉంది. టీకాలు పొందని బాలలు 32 శాతం మన దేశంలో ఉన్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం వ్యాధులతో మరణిస్తున్న బాలల సంఖ్య దాదాపు పదిహేను లక్షలు. ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య అరవైలక్షలు. అంటే ప్రపంచవ్యాప్తంగా బాలల మరణా లల్లో  పావు వంతు మన దేశంలోనే  అన్నమాట. టెక్నాలజీ ఆకాశపుటంచుల్ని తాకుతున్న ప్రస్తుత సమాజంలో కేవలం సరైన సమయంలో వ్యాధినిరోధక టీకాలు లభించక పదిహేను లక్షల మంది ఉసురు పోతుండడం సిగ్గుచేటు. ఈ మరణాలు నివారించడానికి వీలున్నవి. కొద్దిపాటి జాగ్రత్తలు... పెద్దల్లో అవగాహన కల్పించడం... టీకాలపై ఉన్న అపోహలు తొలగించడం... పుట్టిన ప్రతి బిడ్డకూ వ్యాధినిరోధక టీకాల్ని సక్రమంగా వేయించేలా చేయడం ద్వారా ఈ మరణాల్ని ఆపడానికి అవకాశం ఉంటుంది. 


అపోహల్ని తొలగిస్తేనే : ఇప్పటికీ మన దేశంలో టీకాలపై ఎన్నో అపోహలున్నాయి. ప్రజల్లో ఉన్న ఈ అపోహల్ని తొలగించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితాన్నిస్తున్నట్టు కనిపించడం లేదు అనేకంటే సరిపోవడం లేదనేది సత్యం. తల్లి గర్భంలో ఉన్నప్పటినుంచీ ఐదేళ్ల వయసు వచ్చే వరకూ దశల వారీగా టీకాల్ని వేయించాల్సిన అవసరం ఉంది. మన గ్రామాల్లో ఇప్పటికీ టీకాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆ శిబిరాలకు వచ్చే వారికి టీకాలు వేయించడంతో తన పని అయిపోయినట్లు వ్యవహరిస్తోందని చెప్పొచ్చు. వైద్య శిబిరాలలో టీకాలు వేయించడం ఎంత ముఖ్యమో పెద్దల్లో టీకాల పట్ల అవగాహన కల్పించడమూ అంతే ముఖ్యం. దాని కోసం ప్రత్యేక ప్రణాళికల్ని ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. గ్రామీణ వైద్య సిబ్బందితో ప్రతి గడపకూ టీకాల ప్రయోజనాల్ని చేర్చాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా తమ విధివిధానాల్ని ప్రజలకు చెప్పడానికి ఏ విధంగా అయితే పార్టీలు ప్రతి గడపనూ పలకరిస్తాయో... అదే విధంగా ప్రతి గడపకూ టీకాల గురించి తెలియచెప్పే అవగాహనా కార్యక్రమాల్ని సంవత్సరానికి కనీసం నాలుగు సార్లు నిర్వహించాలి. తద్వారా అవగహనా రాహిత్యంతో ఉన్న వారికి మేలు జరుగుతుంది. ఇది యుద్ధ ప్రాతిపాదికన చేయాల్సిన కార్యక్రమం. వ్యాధి నిరోధక టీకాలు ప్రతి బాలుడి జన్మ హక్కు అనే విషయాన్ని పెద్దలకు అర్ధమయ్యేలా చెప్పడం ద్వారా బాలల్లో మరణాల్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. 


లెక్కలన్నీ సరైనవేనా? : కాగితాల మీద ప్రభుత్వం ప్రకటించే లెక్కలన్నీ సరైనవేనా... అంటే దానికి సమాధానం లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే కింది స్థాయిలో రిపోర్టుల తయారీలో విపరీతమైన అలసత్వం ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఉదాహరణకు పదివేల మందికి మీ పరిధిలో టీకాలు వేయాలి అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే... రిపోర్టు దాదాపుగా అందరికీ వేసినట్టుగానే ఇస్తారు. కానీ, అక్కడ కనీసం పదిశాతం మందికి అవి అందవన్నది సత్యం. దానికి కారణాలు అనేకం ఉండొచ్చు. మానవ నిర్లక్ష్యం... సిబ్బందిలో ఏం అవుతుందిలే అనే అలసత్వం.. కాగితం లెక్కలు సరిపోతాయనే భావం... ఇవన్నీ వెరశి రిపోర్టులు నూరుశాతంగానే సమర్పిస్తారు. పోలియో రహిత దేశంగా భారతదేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆ ప్రకటన వచ్చిన అతి కొద్ది కాలంలోనే హైదరాబాద్‌లో పోలియో కేసు నమోదైంది. ఇది బయటకు వచ్చిన కేసు మ్త్రామే. ఇంకొన్ని ఇలాంటి కేసులు ఉండొచ్చు. అందువల్ల రిపోర్టుల మీద ఆధారపడి చంకలు గుద్దుకోవడం సరికాదు. అందరిలో జవాబుదారీ తనం పెంపొందించడం అవసరం.


లక్ష్యం నెరవేరేనా? : 2020 కల్లా దేశంలోని 90 శాతం మంది పిల్లలకు సమగ్ర టీకాల్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయిదేళ్ల లోపు పిల్లలకు టీకాలపై దృష్టి సారించామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే 32 శాతం మందికి టీకాలు ఇప్పటికీ అందలేదన్న విషయం ప్రభుత్వం లక్ష్యానికి ఎంత దూరంలో ఉందో తెలియచెబుతోంది. టీకాల పంపిణీని కేంద్ర ప్రభుత్వం ఉద్యమరూపంలో ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తోంది. ఇది జరిగితే దాదాప 3,500 కోట్ల రూపాయల్ని భారతదేశంలోనే ఖర్చు చేయాలని అంతర్జాతీయ టీకాల సమాఖ్య సిద్ధమవుతోంది. అంతర్జాతీయ సమాఖ్య నుంచి ఇంత మద్దతు లభిస్తున్న తరుణంలో మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ర్టమూ తమ పరిధిలో కొత్త లక్ష్యాల్ని ఏర్పాటు చేసుకుని బాలలకు టీకాలు ఇప్పించాల్సిన బాధ్యతను నెరవేర్చాలి. అపుడే దేశ భవిష్యత్‌ ముఖచిత్రం చిన్నారుల చిరునవ్వులా వెలిగిపోతుంది. 


- కొండూరి శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయుడు, విజయవాడ










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com