గ్రీన్‌పార్క్ : మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతిని ఎదుర్కొన్న తర్వాత బ్యాట్స్‌మన్ క్రీజులో ఉండటం అనేది క్రికెట్ నియమావళిలో ప్రాథమిక నియమం. కానీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన క్రికెటర్ ఈ నియమాన్ని మర్చిపోతే మూల్యం చెల్లించుకోకతప్పదు. షాట్ ఆడిన తర్వాత క్రీజు వెలుపలకు వచ్చి మళ్లీ క్రీజులో బ్యాట్ పెట్టకపోవడంతో అనూహ్యంగా ఫీల్డర్ చేతిలో ఔటెన సన్నివేశం బుధవారం చోటుచేసుకుంది. ఈ తప్పిదం చేసింది మరెవరో కాదు ధోనీ స్థానాన్ని భర్తీ చేస్తాడని భావిస్తున్న రిషబ్ పంత్ (వికెట్‌కీపింగ్) కావడం గమనార్హం. ఐపీఎల్-10లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్‌పార్‌క స్టేడియంలో గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ సంగ్వాన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ సంజు శాంసన్ వికెట్ కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ నాలుగో బంతిని బౌండరీ బాది మంచి వూపుమీదున్నాడు. ఐదో బంతి పంత్ ప్యాడ్‌కు తాకి స్లిప్‌లో ఉన్న గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా చేతిలో పడింది. అదే సమయంలో బౌలర్ సంగ్వాన్ ఎల్బీ కోసం అంపైర్ అప్పీల్ చేశాడు. మరో ఎండ్‌లో ఉన్న కరుణ్ నాయర్‌కు పరుగు కోసం రావద్దని చేతితో సంజ్ఞ చేస్తూ క్రీజులో బ్యాట్ పెట్టడాన్ని పంత్ మరచిపోయాడు. ఇది గమనించిన రైనా బంతిని వికెట్ల మీదకి విసరడంతో పంత్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. క్రికెట్ ఆడుతున్నప్పుడు కనీస నియమాలు పాటించాల్సిన సమయంలో అలసత్వం ప్రదర్శిస్తే మూల్యం చెల్లించుకోకతప్పదని వ్యాఖ్యాతలతో పాటు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ జట్టుకు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.