ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాజిక తెలంగాణ స్వాప్నికుడు మారోజు వీరుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 02:21 AM

సూర్యోదయం కుట్ర కాదు. కానీ మారోజు వీరుని మరణం మాత్రం కచ్చితంగా కుట్రే. ఎందుకంటే మిత్రద్రోహంచేత  శత్రు చేజిక్కిండు. ప్రాణస్నేహితులే పంచమాంగ దళం అని, సహచరులూ స్వార్థపరులేనని గ్రహించలేక పోయిండు. శత్రుత్వం కన్నా మిత్రద్రోహం మహా దుర్మర్గామైంది. కోవర్టుల విషపుకోరలకు బలైండు. శత్రుశిబిరాన్ని చేధించలేక పోయిండు. నమ్మిన బహుజన శ్రామిక సిద్ధాంతం కోసం ప్రాణం ఇచ్చిండు. త్యాగం ఉన్నతమైంది. ప్రాణత్యాగం మహోన్నతమైంది. వీరన్నను భౌతికంగా అంతమొందించినా, వీరన్న ఆలోచనా విధానాన్ని అంతమొందించ లేరు. వీరన్నకే కాదు, కులవర్గ పోరాటానికీ వాళ్ళు ద్రోహం చేసిండ్లు. కాలం చాలా గొప్పది. తప్పక వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తది. ప్రజాస్వామిక విలువల పరిరక్షణ, సామాజిక తెలంగాణ సాధన వీరన్న ఆశయం. తన జీవితమంతా తనప్రజల కోసం తపించిండు. రేయింబవళ్ళు పోరుబాటల పయనించిండు. ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నవాడు. ఉన్నతమైన సమాజ నిర్మాణం కోసం కంకణ బద్దుడైండు. ప్రజల విముక్తే వీరన్నకు ప్రాణప్రదం. ప్రజల కష్టాలకు  కులవర్గ సమాజమే కారణం భావించిండు. దాన్ని కూకటివేళ్ళతో పెకిలించాలన్నడు. శోకం లేని లోకం కావాలని కలకన్నడు. ఆధునిక అపర కాలజ్ఞాని వీరన్న. సాయుధ పోరునూ ప్రజాస్వామ్య తీరునూ  ఎంచుకున్నడు. జమిలి పోరాటమే బహుజనుల విముక్తి మార్గమని తీర్మానించుకున్నడు.


భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అణగారిన కులాలు ఆయుదాలు ఎత్తిండ్లు. సామాన్యులు సైతం సాయుధులైండు. వీరన్న తల్లిదండ్రులు మారోజు రామలింగం, సూరమ్మ. భీంరెడ్డి నరసింహారెడ్డి దళంల వాళ్ళు సభ్యులు. ఆ రోజుల్లోనే కులాంతర వివాహం చేసుకున్నరు. రామలింగం వడ్ల కమ్మరి. సూరమ్మ గౌడ్‌. వాళ్ళకు ఐదుగురు కొడుకులు, ముగ్గురు బిడ్డలు. 1962 జనవరి 1న వీరన్న జననం. మే 16న ఆయన వీరత్వం పొందాడు.. ఎర్రజెండా వెలిసి పోతున్న సమయాన నీలిరంగు పులిమి ఆకాశాన ఎగిరేసే వీరుడు అయ్యిండు. మార్క్సిజం, పూలే అంబేద్కరిజంతో ఆంధ్రప్రదేశ్‌ ల అస్థిత్వ పోరాటాలకు ఆధ్యుడు అయిండు.


కాన్షీరాం నేతృత్వంల బహుజన సమాజ్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంల ప్రవేశించడంతో రాజకీయ పరిస్థితులు డిఫెన్సుల పడ్డయి. అది కమ్యూనిస్ట్‌, నక్సలైట్‌ పార్టీలకు కూడా తప్పలేదు. ఆ క్రమంలనే జనశక్తి నక్సలైట్‌ పార్టీల కూడా చర్చలు మొదలైనై. అప్పటి వరకు అన్ని నక్సలైట్‌ పార్టీలు అగ్రకుల నాయకత్వంలనే నడుస్తునై ్న. ఒక్క జనశక్తి నక్సలైట్‌ పార్టీకి మాత్రమే ఒక బహుజనుడు నాయకత్వం వహిస్తుండు. ఆయన సూచన ఫలితంగా పి డి ఎస్‌ యు రాష్ట్ర నాయకుడైన వీరన్న నేతృత్వంల డఫోడం ఏర్పాటైంది. దాంతో జనశక్తి నక్సలైట్‌ శిబిరంల కూడా విభేదాలు తలెత్తినై. నాయకత్వం కాపాడుకోనికి ఆ బహుజన నాయకుడు తిరోగమనం పట్టిండు. డఫోడం డైరెక్షన్‌ తో వీరన్న పురోగమించిండు. జనశక్తి పార్టీ నిలువునా చీలిపోయింది. ఒక వర్గం మారోజు వీరన్న నాయకత్వంల 1998 డిసెంబర్‌ 25న ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్‌ పార్టీ(బహుజన శ్రామిక విముక్తి)గా ఆవిర్భవించింది. మారోజు వీరన్న మార్క్సిజం, పూలే అంబేద్కరిజంతో అస్తిత్వ పోరాటాలకు శ్రీకారం చుట్టిండు. కులచైతన్యంతో హక్కుల పోరాటాలు మొదలు పెట్టిండు. మాదిగల దండోర, గొల్లకురుమల దోలుదెబ్బ, రజకుల చాకిరేవు దెబ్బ, లంబాడీల నంగారా భేరి, గౌండ్ల మోకుదెబ్బ, మాలల గుతుప దెబ్బ, ఎరుకల కుర్రు, ఆదివాసిల తుడుం దెబ్బ, తదితర బహుజన కులాలు నూతన చైతన్యంతో ప్రజాస్వామ్య హక్కుల సాధనా సంఘాలు ఏర్పాటు చేసిండు. అతిమంగా బహుజన రాజ్యాధికారం వైపు పోరాటాలు ఎక్కుపెట్టిండు వీరన్న. అస్తిత్వ పోరాటాలతోనే ఆగిపోలేదు. 


అంబేద్కర్‌ అన్నట్టు చిన్న రాష్ట్రాలల్ల అభివృద్ధి ఫలాలు అందరికి అందుతాయని, బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని వీరన్నా నమ్మిండు. తెలంగాణల బహుజన రాజ్యం స్థాపనే లక్ష్యంగా 1996లనే  తెలంగాణ మహాసభను ఏర్పాటు చేసిండు. 1997 ఆగష్టు 11న సూర్యాపేటల 50 వేలమందితో తెలంగాణ మహాసభ ఆధ్వర్యంల భారీ బహిరంగసభ నిర్వహించిండు. దాంతో తెలంగాణల అణగారిన వర్గాలల్ల కొత్త ఆశలు చిగురించినై. సీమాంధ్ర వలసవాదులు తమకు రాబోయే ప్రమాదాన్ని పసిగట్టిండ్లు. ఆంధ్ర వలసవాద పెత్తందారి కులాలు, పెట్టుబడిదారులు వీరన్న ప్రతిపాదించిన బహుజన శ్రామిక సిద్ధాంతంతో, తెలంగాణ విముక్తి పోరాటంతో తలపడుడు తమవల్లా కాదని గుర్తించిండ్లు. వీగట్లనే వీరన్న మీదా పగబట్టిండ్లు. హతమార్చేందుకు కుట్రలు చేస్తున్నట్టు ఆ నోట ఈ నోట సమాచారం. చాలామంది బహుజన మేధావులు, హితులు జాగ్రత్త గా ఉండాలని వీరన్నకు సూచించిండ్లు. అవసరమైతే హైదరాబాద్‌ వదిలేసి రహస్య ప్రదేశాలకు పోవాలని హితవు  చెప్పిండ్లు. వీరన్న కూడా రాబోయే ఉపద్రవాన్ని గుర్తించిండు. కానీ హైదరాబాద్‌ విడిసి తను వెళ్లిపోతే తెలంగాణ ఉద్యమానికి మరోసారి ద్రోహం జరుగొచ్చని ఊహించిండు. తను అందుబాటుల ఉండక తప్పదని భావించిండు. రహస్య జీవితం ఇష్టం లేక కాదు. త్యాగాలు చేయలేక కాదు. వ్యూహం, ఎత్తుగడలు తెలియక కాదు. శత్రువుకు భయపడి అసలే కాదు. వీరన్న నిజమైన విప్లవకారుడు. నిర్బంధాలను చూసి వెరవలేదు. ప్రజల మధ్య ఉండి, ప్రజా ఉద్యమాలకు చేరువగా ఉండి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయలేనే బహిరంగ జీవితాన్ని కోరుకున్నడు. మిత్రద్రోహంచేత  శత్రు చేజిక్కిండు. శత్రు శిబిరాన్ని చేధించలేక పోయిండు. ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్‌ పార్టీ(బహుజన శ్రామిక విముక్తి) నాయకుడు, కళాకారుడు మారోజు వీరన్నను 1999 మే 16న నేరెడ్‌ మేట్‌ చౌరస్తా నుంచి పట్టుకెళ్ళి ఎన్కౌంటర్ల చంపేసిండు.


గట్లనే తెలంగాణ కళాసమితి నాయకురాలు బెల్లి లలితాయాదవ్‌ ను 1999 మే 29న కిరాయి హంతకులు 16 ముక్కలుగా నరికి బాయిల పడేసిండ్లు. ఉన్నత ఆశయం కోసం ఊపిరి కోల్పోయిన శరీరం శవం కాదు, శత్రువు పాలిట మృత్యు శాసనం అన్నట్లు తెలంగాణ ఉద్యమంల ప్రాణత్యాగం చేసిన వీరుల ఉసురు ఆంధ్ర వలసవాద తగిలింది. వెయ్యి బక్క గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు నేలరాలినట్టు ఆంధ్ర వలసవాద పెత్తందారి కులాలు, పెట్టుబడిదారులు కొట్టుక పోయిండ్లు. అమరుల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. భౌగోళిక తెలంగాణ వచ్చింది. కానీ దొరల పాలైంది. దుర్మార్గపు గడీల పాలన పునరావృతం అయితాంది. మారోజు వీరన్నలాంటి మరెందరో అమరుల ఆశయం తెలంగాణల బహుజన రాజ్యం. సమసమాజ స్థాపన. సామజిక తెలంగాణ ఉద్యమంతోనే అది సాధ్యం. అప్పుడే మారోజు వీరన్నకు, తెలంగాణ అమర వీరులందరికీ నిజమైన నివాళి. 


          - ప్రొఫెసర్‌. ప్రభంజన్‌ యాదవ్‌










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com