ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దద్దరిల్లిన ధర్నా చౌక్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 03:12 AM

ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జి, పలువురికి గాయాలు


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : ధర్నాచౌక్‌ తరలింపును నిరసిస్తూ అఖిలప క్షం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ధర్నాచౌక్‌ వల్ల తామెంతో ఇబ్బందులు పడుతున్నామని దీన్ని ఇక్కడి నుంచి తరలించాల్సిందేనని ఒక వైపు స్థానికులు ఆందోళనకు దిగగా మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారానికివేదికగా ఉన్న ధర్నా చౌక్‌ను ఇక్కడి నుంచి తరలిస్తే సహిం చేది లేదంటూ అఖిలపక్ష నేతలు, ప్రజా సంఘాలు కదం తొక్కాయి. అఖిలపక్షానికి వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన  నిరసనలతో ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి, ఒకరిపై ఒకరు దాడికి పాల్పడటంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఒకరిపై ఒకరు కర్రలు, జెండాలతో దాడులు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలవారు కుర్చీలు, రాళ్లువిసిరేశారు. దొరికినవారిని పిడిగుద్దు లు గుద్దారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురు కార్యకర్తలు, స్థానికులు గాయపడ్డారు.  దీనిపై పలు పార్టీల నేతలు సీఎం కేసీఆర్‌ వైఖరిని దుయ్యబట్టారు. ఈ ఘర్షణల వెనుక ప్రభుత్వం, పోలీసుల హస్తం ఉందని అఖిలపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ప్రశాంతంగా నిర్వహిస్తున్న ఆందోళనలో అలజడి రేపి శాంతిభద్రతల సాకుతో తమ నిరసనను అడ్డుకోవాలని చూస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. ధర్నాచౌక్‌ తరలింపును వ్యతిరేకిస్తున్న అఖిలపక్షానికి, ధర్నాచౌక్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్న స్థానిక ప్రజల నిరసనలకు పోలీసులు ఒకే రోజు ఎలా అనుమతి ఇస్తారని విపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జీవన్‌రెడ్డి, డీకే అరుణ, గూడూరు నారాయణ, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, రేవంత్‌ రెడ్డి, పెద్దిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, మాజీ ఎంపీ అజీజ్‌ పాషా, సున్నం రాజయ్య, పీవోడబ్లూ సంధ్య, అరుణోదయా సమాఖ్య విమలక్క, ప్రజా సంఘాలు, బీసీ సంఘాల నేతల నేతృత్వంలో ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాచౌక్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు.


కేసీఆర్‌ అణగదొక్కుతున్నారు : ఉత్తమ్‌


ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును ముఖ్యమంత్రి కేసీఆర్‌ అణగదొక్కుతున్నారని తెలంగాణపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఇందిరాపార్కులోని ధర్నాచౌక్‌ వద్ద జేఏసీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కార్యకర్తలు, నేతలతో కలిసి ఆయన గాంధీభవన్‌ నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, తమకు అనుకూలమైన కొంతమంది స్థానికులను రెచ్చగొట్టారని ఆయన అన్నారు. స్థానికులకు అభ్యంతరం లేదని స్థానిక ఎమ్మెల్యే కె.లక్ష్మణ్‌ చెప్పారని కానీ, ప్రభుత్వం వారిని రెచ్చగొట్టేలా చేసిందని ఉత్తమ్‌ ఆరోపించారు.


ప్రభుత్వమై రెచ్చగొడుతోందిః కోదండరామ్‌


మేం శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా కానీ, ప్రభుత్వం ఘర్షణ పూరిత వాతావరణం సృష్టిస్తోందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదం డరాం ఆరోపించారు. ఇందిరాపార్కులోని ధర్నాచౌక్‌ వద్ద నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మేం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వమే కావాలనే ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మఫ్టీలో ఉన్న పోలీసులు కొందరు తమపై దాడికి దిగి ఘర్షణలు జరిగేలా ప్రయత్నించారని ఆరోపించారు. ధర్నాచౌక్‌పై ఇరువర్గాలతో చర్చించి సమస్య పరిష్కరించాల్సిన పోలీసులు ఇలాంటి ఘటనలకు పాల్పడటం మంచిది కాదన్నారు. ధర్నాచౌక్‌ వద్ద జరిగే ఘర్షణలకు నగర పోలీస్‌ కమిషనరే బాధ్యత వహించాల్సి ఉంటుందని కోదండరామ్‌ అన్నారు.


ఈ సందర్భంగా హైదరాబాద్‌ సీపీ వైఖరిని ఖండిస్తున్నట్లు కోదండరామ్‌ పేర్కొన్నారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరామని, ధర్నాచౌక్‌ తరలింపు అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోదండ రామ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


ధర్నాచౌక్‌ కేసీఆర్‌ జాగీరా..? ః రేవంత్‌


ధర్నాచౌక్‌ ఏమైనా కేసీఆర్‌ జాగీరా..? అంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబంలోని 4గురికి వ్యతిరేకంగా 4కోట్లు మంది తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరిం చారు. అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాలు శాంతియుతంగా ధర్నా నిర్వహి స్తోంటే అడ్డుకోవడం మూర్ఖత్వమాన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరసనలకు వేదికగా ఉన్న ధర్నాచౌక్‌ను తరలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ధర్నా చౌక్‌కు ప్రత్యామ్నాయంగా ఆయన భజనపరులతో సమావేశమయ్యే పైరవీ భవన్‌, సచివాలయంలో నిరుపయోగంగా ఉన్న సమాతా బ్లాక్‌లలో ఏదైనా ఒకటి ధర్నాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని రేవంత్‌ ఎద్దేవా చేశారు. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడినట్లే..కేసీఆర్‌ ప్రభుత్వానికి ప్రజలు ఘోరీ కట్టే రోజు దగ్గరలోనే ఉందని రేవంత్‌ హెచ్చరించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com