ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రూపు గొడవలతో రోడ్డెక్కుతున్న కాంగ్రెస్‌ నేతలు ?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2017, 01:37 AM

మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధిః ఓ వైపు అధికార టిఆర్‌ఎస్‌ తన దూకుడును కొనసాగిస్తుంది. వలసలను ప్రోత్సహిస్తూ ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసే పనిలో బిజీగా ఉంది. కారు స్పీడ్‌కు సైకిల్‌ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడగా, కాంగ్రెస్‌ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఈ పరిస్థితులలో ఏకతాటిపై ఉంటూ పార్టీని ముందుకు నడిపించాల్సిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వర్గ విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. ఉత్తర తెలంగాణకు కీలకమైన వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుండి కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. గత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాదించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇపుడు జిల్లాలో పార్టీకున్న ఏకైక ఎమ్మెల్యే. అయితే మాజీ పిసిసి చీఫ్‌ పొన్నాల వైఖరి వల్లే తనకు టికెట్‌ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన లక్ష్మ య్య తో కలసి పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. వరంగల్‌ పార్లమెంటు ఉప ఎన్నికల సమయంలోను ఆయన ఒంటరిగానే ప్రచారం నిర్వహించారు. ఇప్పటి వరకు వీరిద్దరు కలసి పాల్గొన్న మీటింగ్‌ ఒక్కటి కూడ లేకపోవడం గమనర్హం. ఎమ్మెల్యేగా ఓటమి తరువాత పొన్నాల కూడ వరంగల్‌ జిల్లాలో పర్యటించడం దాదాపుగా మానేశారు. వచ్చిన ఒకటి రెండు సందర్బాలలో తన సొంత నియోజకవర్గమైన జనగామకే ఎక్కువ సమయం కెటాయిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు, డిసిసిబి ఛైర్మన్‌ జంగా రాఘవరెడ్డిల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మండలాల వారిగా నిర్వహిస్తున్న పార్టీ కార్యకర్తల సమావేశంలోను దుగ్యాల పాల్గొనడం లేదు. రేపో, మాపో ఆయన బిజెపిలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఉన్న గొట్టిముక్కల రమాకాంత్‌రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్‌ చేస్తున్నట్లు పిసిసి నేతలు ప్రకటించారు. ఆయనతో పాటు అనుచరులు, ఆయన భార్యను కూడ కాంగ్రెస్‌నుండి సాగనంపారు. ఎక్కడ ఏమి లేకుండా ఆయనను పార్టీ నుండి పంపించివేయడం ఇపుడు ఓరుగల్లు జిల్లాలో హట్‌ టాపిక్‌ అయింది. వాస్తవానికి ఆయన సస్పెన్షన్‌ వెనకాల పెద్ద తతంగమే నడిచిందని సమాచారం. 


క్షేత్రస్థాయి సమావేశాలలో బయటపడుతున్న విభేదాలు...


రాష్ట్ర స్థాయిలో పార్టీ నుండి వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఏఐసిసి నేతలు నిర్ణయించారు. గ్రామాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నేతలను ఆదేశించారు. వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా సభలు కొనసాగుతున్నాయి. ఇందులో నాయకుల మద్య ఉన్న విభేదాలు బట్టబయలవుతున్నాయి. డోర్నకల్‌, మహబూబాబాద్‌ వంటి చోట్ల కనీసం క్యాడర్‌ కూడ హజరుకాలేకపోతున్నరు. అక్కడ ఎమ్మెల్యే డిఎస్‌ రెడ్యానాయక్‌, మాజీ ఎమ్మెల్యే ఆయన కూతురు కవిత పార్టీ మారిన తరువాత ఇప్పటి వరకు క్యాడర్‌ను పట్టించుకున్న నాయకుడు లేకుండా పోయారు. మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్‌ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కొంత వరకు ప్రయత్నం చేసిన క్షేత్ర స్థాయిలో మాత్రం అది సత్ఫలితాలనివ్వలేదు. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు మెండుగా ఉన్న బలరాం నాయక్‌ అపుడపుడు నోరు పారేసుకోవడం మైనస్‌గా మారింది.  వర్దన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిదిలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీదర్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత నమిండ్ల శ్రీనివాస్‌ వర్గీయుల మద్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరిదిలో పార్టీ కార్యక్రమాలు అనుకున్న స్థాయిలో జరగడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


రమాకాంత్‌రెడ్డి సస్పెన్షన్‌ వెనక జంగా పాత్ర....


ప్రస్తుతం వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌పార్టీలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా జంగా రాఘవరెడ్డి ఉన్నారు. ఈ మద్య జరిగిన కార్పోరేషన్‌ ఎన్నికలలోను ఆయన తన ముగ్గురు అనుచరులను ఒంటి చేత్తో కార్పోరేటర్లుగా గెలిపించుకున్నారు. ప్రతిపక్ష పార్టీలో కొనసాగుతూ డిసిసిబి డైరక్టర్లను ఆయన కాపాడుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క డైరక్టర్‌ కూడ పార్టీని వదిలిపెట్టి వెళ్లలేదు. అయితే వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం పై కన్నేసిన జంగా ఇక్కడ తనకు వ్యతిరేకంగా బలమైన గ్రూపుగా ఎదుగుతున్న రమాకాంత్‌రెడ్డిని పార్టీ నుండి పంపించి వేయడంలో విజయం సాదించారు. గతంలో ఒకటి రెండు సందర్బాలలో జంగాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన యువనేతను సస్పెండ్‌ చేయించి పార్టీలో తన పట్టును నిరూపించుకున్నారు. ఈయనకు డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్‌ రెడ్డి సహకరించారు. వరంగల్‌ పట్టణంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌కు తిరిగి జవసత్వాలు నింపడమే తమ పని అని ఇద్దరు నేతలు ప్రకటించడం కొసమెరుపు. జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌, పరకాల తదితర నియోజకవర్గాలలోను పార్టీ పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదు. ఇంఛార్జీలుగా ఉన్న విజయరామారావు, ఇనుగాల వెంకట్రాంరెడ్డిలు క్యాడర్‌ను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ఎన్నికల సమయంలోనే తిప్పుకోవడం ఆ తరువాత వదిలేయడం వీరికి సహజమని ఇక్కడి కార్యకర్తలు అంటున్నారు. మొత్తమ్మీద టిఆర్‌ఎస్‌ రాష్ట్రంలోని ఇతర పార్టీలను బలహీనపరుస్తూ జెట్‌స్పీడ్‌తో దూసుకుపోతుంటే కాంగ్రెస్‌ నేతలు మాత్రం గిల్లీ కజ్జాలతో కాలం వెళ్లదీస్తున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com