ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్బంధాలకు వెరవం పోరాటాన్ని ఆపం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 02:35 AM

 -27న విద్యార్థి, యువజన సంఘాల సమావేశం
 -జేఏసీ నేతల సమావేశంలో కోదండరాం
 -పిట్టల రవీందర్‌ తీరు ఆక్షేపణీయం

హైదరాబాద్‌, సూర్య ప్రధానప్రతినిధి:  రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతాంగ సమస్యలు పరిష్కారం వరకు పోరాటాన్ని ఆపమని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొ.కోదంరాం స్పష్టం చేశారు. రైతులు, నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న తమపై ప్రభుత్వం ఎన్ని  నిర్భందాలు సృష్టించినా వెరవకుండా పోరాటాన్ని ఉదృతం చేస్తామన్నారు. నిరుద్యోగ, రైతాంగ సమస్యలపై తదుపరి కార్యాచరణను చేపట్టేందుకు ఈ నెల 27న విద్యార్థి, యువజన సంఘాలతో సమావేశం నిర్వహించాలని తెలంగాణ జేఏసీ  నిర్ణయించింది. శనివారం నాంపల్లిలోని జేఏసీ కార్యాలయంలో ఆచార్య కోదండరాం అధ్యక్షతన జేఏసీ నేతలు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వం నిర్బంధ ధోరణి అవలంబించినా ప్రజాసమస్యలపై పోరాటం ఆపేదిలేదని సమావేశంలో కోదండరాం నేతలకు దిశానిర్దేశం చేశారు. మైనార్టీల సమస్యలపై సుధీర్‌ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలని తీర్మానం చేశారు. అందులో భాగంగా మార్చి 1న మహబూబ్‌నగర్‌, 4న నిర్మల్‌, 5న కరీంనగర్‌, 11న వరంగల్‌ జిల్లాల్లో ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఐకాసలో లుకలుకలు ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని, కొందరు పనిగట్టుకొని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఐకాస నేతలు చెబుతున్నారు.మార్చి 12న జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. పిట్టల రవీందర్‌పై జేఏసీ నేతల మండిపాటు: జేఏసీలో కీలక నేత అయిన పిట్టల రవీందర్‌ పై జేఏసీ నేతలు మండిపడ్డారు. ఈమేరకు శనివారం నాంపల్లిలో టీ. జేఏసీ అంతర్గత సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పలువురు నేతలు రవీందర్‌ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జేఏసీ నుంచి ఆయన్ను బహిష్కరించాలని నేతలు డిమాండ్‌ చేశారు. అయితే... ఆయన విజ్ఞతకే వదిలేద్దామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం సర్దిచెప్పారు. కాగా... వెంకట్‌రెడ్డి, బైరి రమేశ్‌కు మీడియా కోఆర్డినేషన్‌ బాధ్యతలు అప్పగించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa