హైదరాబాద్: అమెరికాలో శ్రీనివాస్ కూచిభొట్ల దారుణ హత్యతో ఆయన కుటుంబసభ్యులు నివాసం ఉంటున్న హైదరాబాద్ శివారు బౌరంపేటలోని ప్రణీత్ బౌంటీని విషాదఛాయలు వెన్నాడుతున్నాయి. శ్రీనివాస్ మృతదేహాన్ని కార్గో విమానంలో సోమవారం రాత్రికి నగరానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. శ్రీనివాస్ సతీమణి సునయనతోపాటు అతని సోదరుడు, సోదరుడి భార్య, మరో మిత్రుడు మృతదేహం వెంట రానున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీనివాస్ మృతదేహం తరలింపు వివరాలను గోప్యంగా ఉంచాలని ఆయన కుటుంబసభ్యులు కోరినట్లు విదేశాంగ వ్యవహారాల శాఖ వర్గాలు తెలిపాయి. జూన్‌లో నగరానికి రావాల్సిన శ్రీనివాస్ ఇలా వూహించని రీతిలో విగతజీవిగా మారడంతో ఆయన కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. షాక్‌లో ఉన్న అతని తల్లిదండ్రులు.. తమ రెండో కుమారుణ్ని అమెరికా నుంచి తిరిగి వచ్చేయాలని కోరుతున్నారని సన్నిహితులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సత్వరం స్పందించడంతో మూడు గంటల్లోనే తాము వూహించని రీతిలో సహాయకచర్యల్ని ముమ్మరం చేశారని తెలిపారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా బాగా స్పందించారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa