తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారలో బ్రాహ్మణ బంధువులు పాల్గొని మొక్కలు నాటాలని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి కోరారు. బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తోందని, ఆ నిధులతో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పలు పథకాలు అమలులోకి తెస్తోందని చెప్పారు. విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సబ్సిడీపై రుణాలు, హెల్త్ ఇన్సూరెన్స్ తదితర సహాయానికి ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. హైదరాబాద్ లోని సచివాలయంలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్ లోని గోపనపల్లిలో బ్రాహ్మణ సదనం నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరయ్యాయని రమణాచారి తెలిపారు. ఆరు ఎకరాల స్థలంలో నిర్మించే ఈ సదనానికి ఇప్పటికే శంకుస్థాపన జరిగిందన్నారు. జిల్లాల నుంచి బ్రాహ్మణ సదనాల నిర్మాణానికి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నామని ప్రకటించారు.ఈ సమావేశంలో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ పురాణం సతీష్ తదితరులు పాల్గొన్నారు.