సంగారెడ్డి: పటాన్‌చెరు మండలం నందిగామ దగ్గర ఏపీజే అబ్దుల్‌కలాం అలీఫ్ గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ... అబ్దుల్ కలాం పేరుతో గ్రీన్ ఇండస్టీయల్ పార్క్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. ఉపాధి కల్పన రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో ఇంటింటికి మంచి నీళ్లు ఇస్తున్నం. మిషన్ కాకతీయ పేరుతో 46వేల చెరువులు బాగు చేసుకున్నాం. సీఎం కేసీఆర్ తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మారుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏడాదికి 50 కోట్ల మొక్కలు నాటుతుంటే ఒక్క తెలంగాణలోనే 47 కోట్ల మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు.
70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇంటింటికి మంచి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టకరం. సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా గడపగడపకు మంచినీళ్లు అందిస్తున్నారు. గతంలో లంచం ఇవ్వకుండా పరిశ్రమ పెట్టే అవకాశం ఉండేది కాదు. టీఎస్ ఐపాస్ లాంటి పారిశ్రామిక విధానం ప్రపంచంలో మరెక్కడా లేదు. టీఎస్‌ఐపాస్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. దేశంలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉండటానికి సీఎం కేసీఆర్ దార్శనికతే కారణం. రాష్ర్టాభివృద్ధికి తోడ్పడే పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నాం.15 రోజుల్లో అనుమతులు రాకపోతే 16వ రోజు డీమ్డ్ అప్రూవల్‌గా పరిగణిస్తాం. అనుమతుల్లో జాప్యం చేసిన అధికారులకు రోజుకు రూ. వెయ్యి చొప్పున జరిమానాలు విధిస్తున్నామని, పారదర్శకతతో కూడుకున్న టీఎస్‌ఐపాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని వెల్లడించారు. టీ ఐడీయా పేరిట మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాం. టీహబ్ ద్వారా హైదరాబాద్‌లో స్టార్టప్‌లకు ఊతమిచ్చినం. స్టార్టప్స్, ఇంక్యూబేటర్స్‌కు హైదరాబాద్ కేంద్రంగా మారింది. టీ హబ్ స్పూర్తితో నల్సార్, సీసీఎంబీలు కూడా ఇంక్యుబేషన్ సెంటర్లు పెట్టాయి. సుల్తాన్‌పూర్‌లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టడానికి ఫిక్కి ముందుకొచ్చింది. యువతకు నైపుణ్య శిక్షణ కోసం టాస్క్ ఏర్పాటు చేసినం. గుజరాత్ కాటన్ కంటే తెలంగాణ కాటన్ ఎంతో నాణ్యమైనది. వరంగల్‌లో రెండువేల ఎకరాల్లో 2 లక్షల మందికి ఉపాధి కల్పించేలా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఫామ్ టు ఫ్యాషన్ విధానంతో టెక్స్‌టైల్ పార్క్ తీసుకొస్తున్నాం. ఒక తిరుపూర్‌లో 34వేల కోట్ల వస్త్ర ఉత్పత్తి జరుగుతుంది. సిరిసిల్లలో అపారెల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.